ఉమ్మడి పౌరస్మృతిపై మోడీకి హెచ్చరికలు!

‘ఒక దేశం ఒకటే చట్టం’ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తేవడానికి యోచిస్తున్నది. బిజెపి అనుకూల సోషల్ మీడియా బృందాలన్నీ కూడా.. యూసీసీకి అనుకూలంగా…

‘ఒక దేశం ఒకటే చట్టం’ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తేవడానికి యోచిస్తున్నది. బిజెపి అనుకూల సోషల్ మీడియా బృందాలన్నీ కూడా.. యూసీసీకి అనుకూలంగా విచ్చలవిడి ప్రచారాన్ని సోషల్ మీడియాలో వెల్లువెత్తిస్తున్నాయి. ఒక్కో మతానికి ఒక్కో రకం రూల్సు ఉండడం వలన ఆ మతంలోనే అనేక అరాచకపోకడలు చోటు చేసుకుంటున్నాయంటూ.. విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల మనదేశంలో యూనిఫారం సివిల్ కోడ్ అనేది తప్పనిసరి అవసరంగా పలువురు అభివర్ణిస్తున్నారు. 

ఇలా ఒకవైపు వ్యవహారం నడుస్తుండగా.. తాజాగా యూసీసీ అనే వ్యవహారంలో అసలు వేలు పెట్టడమే చేటు చేస్తుందని, ఆ అంశం జోలికి వెళ్లకపోవడమే మంచిదని మోడీ సర్కారుకు హెచ్చరికలు కూడా వస్తున్నాయి. యూసీసీ వలన కేంద్రప్రభుత్వం అనేక రకాల చిక్కుల్లో ఇరుక్కొంటుందని అంటున్నారు. ఈ హెచ్చరికలు చేస్తున్నది మరెవ్వరో కాదు.. ఆయన రాజ్యసభకు దూరమైన రోజున మోడీ ఆత్మీయంగా కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి సీనియర్ నాయకుడు.. కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత కొంత కాలానికి సొంత పార్టీ పెట్టుకున్న కశ్మీరీ నేత గులాం నబీ ఆజాద్. 

యూసీసీ అనేది చాలా సంక్లిష్టమైన అంశమంటున్న ఆజాద్.. అందులో వేలుపెట్టడం అనేది ఆర్టికల్ 370ని రద్దు చేసినంత ఈజీ కాదని హెచ్చరిస్తున్నారు. 370 రద్దు అనేది కేవలం కశ్మీరీ ప్రజలకు సంబంధించినది గనుక.. దేశవ్యాప్త వ్యతిరేకతను మోడీ చూడలేకపోయారని, కానీ యూసీసీ అనేది దేశవ్యాప్తంగా భాజపాను దెబ్బతీస్తుందని ఆయన అంటున్నారు. ఇది కేవలం ముస్లింలతో మాత్రమే ముడిపడినది కాదు.. క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, గిరిజనులు ఇలా అందరితోనూ ముడిపడి ఉంటుంది. అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతుంది. ఇది ఏ పార్టీకి కూడా శ్రేయస్కరం కాదు అని.. ఆజాద్ హితవు చెబుతున్నారు.

అన్ని మతాలకూ ఆగ్రహం తెప్పించే అంశం గనుక.. దాని జోలికి వెళ్లకపోవడమే మంచిదనేది ఆయన సూచన. అయితే యూసీసీ రూపంలో ప్రభుత్వం కనీసం ముసాయిదాను కూడా సిద్ధం చేయకముందే.. విపక్ష నేతలు ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కడం అనేది మంచి పద్ధతి కాదని పలువురు అంటున్నారు. కొన్ని మతాల్లో ఉన్న ప్రత్యేకమైన నిబంధనల వల్ల.. చాలా రకాల సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ మతం వాళ్లే నష్టపోయే వాతావరణమూ ఉంటోంది. యూసీసీ ద్వారా ఇలాంటి అవ్యవస్థలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. 

ప్రభుత్వం ఒక మతం మీద కక్ష కట్టినట్టుగా కాకుండా.. యావత్ సమాజం.. సవ్యంగా నడవడం లక్ష్యంగా ముసాయిదా బిల్లును రూపొందిస్తుందో లేదా.. మతపరంగా అసంతృప్తి జ్వాలలు రేగేలా బిల్లు తయారవుతుందో తెలిస్తే తప్ప.. ఇలాంటి సలహాలు తగవని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.