సాధారణంగా జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రానికి వచ్చి భారీ బహిరంగసభలు నిర్వహిస్తున్నారంటే.. దాని మీద రాష్ట్ర పార్టీ నాయకత్వంలో చాలా ఆశలుంటాయి. అదికూడా ప్రధాని స్థాయిలోని నరేంద్రమోడీ వంటి అత్యంత ప్రభావశీలియైన నాయకుడు.. మరో నాలుగైదు నెలల్లో జరగబోయే ఎన్నికలకు రాష్ట్రాన్ని చైతన్యం చేయడానికి తెలంగాణకు వచ్చి బహిరంగ సభ నిర్వహిస్తే.. నిప్పులు చెరిగే విమర్శలను, ప్రజలను సమ్మోహితుల్ని చేసే సరికొత్త వాగ్దానాలను అందరూ ఆశిస్తారు. కానీ.. మోడీ పర్యటన అలాంటివేం లేకుండానే ముగిసిపోయింది.
ప్రధాని నరేంద్రమోడీ వరంగల్ జిల్లాకు వచ్చారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మొత్తం 6109 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు.
తన ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వం మీద నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం అభివృద్ధి పనుల శంకుస్థాపనలకోసం ఏర్పాటుచేసిన సభ కానే కాదు.. ఎన్నికలలో ప్రజలను ఆకర్షించడానికే నిర్వహిస్తున్న సభ అని అనిపించేలా ఇది జరిగింది. నిజానికి ఏ పార్టీ సభ నిర్వహించినా సరే.. ఈ రెండు రకాల సభల మధ్య ఉండే విభజన రేఖ ఎప్పుడో చెరగిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, సభల్లో కూడా కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే వినిపిస్తుంటాయి. అయితే ఇలాంటి విమర్శల పర్వంలో కూడా.. ప్రధాని నరేంద్రమోడీ ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయారు.
సాధారణంగా మోడీ వంటి నాయకులు వచ్చినప్పుడు రాష్ట్ర పార్టీ నాయకులు తయారుచేసిన స్క్రిప్టునే చదివి వినిపిస్తుంటారని అందరూ అంటుంటారు. అది కొంతమేర నిజమే కావొచ్చు. కానీ.. ఆ స్క్రిప్టును మించి తమ సొంత ముద్ర చూపించగలిగినప్పుడే.. ఆయా నాయకుల విలక్షణత బయటపడుతుంది.
కానీ.. భారతీయ జనతా పార్టీ నుంచి.. భారాస సర్కారు మీద కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న ఆరోపణలు మాత్రమే మోడీ నోటిద్వారా మరోసారి వినిపించాయి.
కేసీఆర్ ది అత్యంత అవినీతి ప్రభుత్వం, ఈ అవినీతి ఢిల్లీ దాకా వ్యాపించింది. కేసీఆర్ కుటుంబం అభివృద్ధి కోసమే తెలంగాణ ఏర్పడినట్టుగా పరిస్థితి తయారైంది. కేంద్రంలోని సర్కారును విమర్శించడం తప్ప కేసీఆర్ కు మరో పనిలేకుండా పోయింది .. లాంటి పాచిపోయిన విమర్శలనే ప్రధాని మోడీ మరోసారి వినిపించారు. ఈ మాటలన్నీ రాష్ట్ర పార్టీ నాయకులు ప్రతి సభలోను, చివరికి ప్రతి రోడ్ కార్నర్ మీటింగుల్లోనూ కూడా చెప్పేవే. మోడీ ప్రసంగంలో కొత్తదనం ఇసుమంతైనా లేదు.
పైగా కేసీఆర్ అవినీతి గురించి అంత లావు విమర్శలు చేసేటప్పుడు.. తొమ్మిదేళ్లుగా అవినీతి చేస్తున్నారని తెలిసి కూడా బాద్యత గల కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తూ కూర్చున్నది అనే మాట కాంగ్రెస్ నుంచి, తటస్థ ప్రజల నుంచి వస్తుందనే ఆలోచన కూడా మోడీకి లేకపోవడం విశేషం.
పైగా ప్రధాని లాంటి వ్యక్తి ఎన్నికలు జరగబోతున్న ఒక రాష్ట్రానికి వచ్చి సమర శంఖారావం పూరించారంటే.. ప్రజల ఆశలు చాలా ఉంటాయి. వరాల వర్షం ఉంటుందని అనుకుంటారు. అలాంటిదేమీ లేనేలేదు. ఇన్నిన్ని వందల వేల కోట్ల పనులు కేంద్రం తరఫున చేస్తున్నాం,.. అనడం తప్ప.. కొత్తగా ఏ ఒక్క వరమూ ఇవ్వకుండానే మోడీ తన ప్రసంగం పూర్తి చేశారు. అందుకే ఆయన మాటల్లో కాస్తయినా కొత్తదనం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.