జనసేనాని పవన్‌కల్యాణ్ మూడో భార్య అన్నా లెజీనావా కేంద్రంగా గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది అవాంఛనీయ పరిణామం. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ పార్టీల అధినేతల భార్యల చుట్టూ సంబంధం లేని వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ దుర్మార్గ వ్యవహారాల్లో రాజకీయ పార్టీలది తిలా పాపం తలా పిడికెడు అని చెప్పక తప్పదు. ఒక పార్టీనే తప్పు పట్టాల్సిన పనిలేదు.
ప్రత్యర్థుల్ని రాజకీయంగా బద్నాం చేయాలని అనుకుంటే, వెంటనే వారికి గుర్తొచ్చేది మహిళలే. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ సతీమణి అన్నా లెజీనావా కేంద్రంగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆమెను వీధిపాలు చేయడంలో ప్రత్యర్థులు ఎంత కారణమో, స్వపక్షీయులు కూడా అంతే బాధ్యత వహించాల్సి వుంటుంది. ఎందుకంటే అన్నా లెజీనావాకు మద్దతుగా నిలుస్తున్నామనే కారణంతో ఆమెపై అన్నవి, అనని విషయాలను కూడా జనసేన వీరమహిళలు తెరపైకి తెస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నా లెజీనావాపై పవన్ వ్యతిరేకుల దుష్ప్రచారం కంటే, జనసేన వీరమహిళలు వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటే కాదనలేం. ఎవరో అనామకుడు ఏదో అంటే, అలాంటిదాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయడం ద్వారా వీరమహిళలు ఏం సాధించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు. సోషల్ మీడియా అనేది విస్తృతమైన ప్రపంచం. దాన్ని కట్టడి చేయడం అంత సులువు కాదు.
పవన్ మూడో సతీమణిపై వీరమహిళలు ఆరోపిస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తుంటే, వాటిపై ఫిర్యాదులను ఎవరూ తప్పు పట్టరు. ఈ సాకుతో పవన్ దగ్గర మార్కులు సంపాదించేందుకు కాస్త ఎక్కువ చేస్తున్నారనే విమర్శ లేకపోలేదు. శుక్రవారం డీజీపీ కార్యాలయం వద్ద హడావుడి చూశాం. ఇవాళ విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అన్ని పార్టీల మహిళలు బాధితులే. ఇందుకు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు మినహాయింపు కాదు. ప్రత్యర్థి పార్టీకి చెందిన మహిళల్ని తాము ఏమైనా అంటాం, తమని మాత్రం ఏమీ అనుకూడదని కోరుకోవడమే అసలు సమస్య.
కావున పవన్‌కల్యాణ్ భార్యకు సంఘీభావం పేరుతో ఆమెను బజారుకీడ్చే పనికి వీరమహిళలు స్వస్తి చెప్పాల్సిన అవసరం వుంది. పవన్ మూడు పెళ్లిళ్లపై విమర్శల గురించి అందరికీ తెలిసినవే. పవన్ సతీమణిపై దుష్ప్రచారం చేస్తున్నారంటేనే కాస్త ఆశ్చర్యం కలుగుతోంది.
ఒకరిద్దరు పోకిరీలు ఎవరైనా అలా చేసి ఉండొచ్చేమో! అలాంటి వాళ్ల పోస్టుల కంటే, అన్నా లెజీనావాకు మద్దతు పేరుతో వీరంగం సృష్టించే వాళ్లతోనే తమ ఆరాధ్య నాయకుడి భార్యకు ఎక్కువ నష్టమని గ్రహిస్తే మంచిది. చెడు సంప్రదాయానికి అందరూ కలిసి ముగింపు పలికాలి. అప్పుడే రాజకీయాల్లో మహిళలను అడ్డు పెట్టుకోవడమనే సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడుతుంది.