మొన్న జ‌గ‌న్, నేడు కేసీఆర్‌పై ఒకే ర‌క‌మైన విమ‌ర్శ!

ఏ రాష్ట్రానికి వెళితే, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. ఇటీవ‌ల జ‌న‌సంప‌ర్క్ అభియాన్‌లో భాగంగా తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ జాతీయ…

ఏ రాష్ట్రానికి వెళితే, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. ఇటీవ‌ల జ‌న‌సంప‌ర్క్ అభియాన్‌లో భాగంగా తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వైసీపీ స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ ప్ర‌భుత్వం అత్యంత అవినీతిమ‌య‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.

మైనింగ్‌, లిక్క‌ర్‌, శ్యాండ్‌, ల్యాండ్ త‌దిత‌ర వాటిల్లో భారీ అవినీతి చోటు చేసుకుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దేశంలోనే అత్యంత అవినీతిమ‌య‌మైన స‌ర్కార్‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించి న‌డ్డా వెళ్లారు. తాజాగా వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ కేసీఆర్ స‌ర్కార్‌పై చెల‌రేగిపోయారు. దేశంలో అందరి కంటే అతిపెద్ద అవినీతి సర్కార్‌ కేసీఆర్‌దే అని మోదీ ధ్వ‌జ‌మెత్తారు. ఆ అవినీతి ఢిల్లీదాకా విస్తరించిందన్నారు.

కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని మోదీ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ అవినీతిలో పోటీ పడుతున్నాయని మోదీ విమర్శించారు. స్కాంల నుంచి దృష్టి మళ్లించ‌డానికే కేసీఆర్‌ కొత్త నాటకాలను  తెరపైకి తెస్తున్నారని విమ‌ర్శించారు. 

కేసీఆర్ ప్ర‌భుత్వం … ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం, కుటుంబ పార్టీని పోషించడం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం, తెలంగాణను అవినీతిలో ముంచ‌డం’ అనే నాలుగే పనులనే చేస్తోందంటూ సెటైర్లు వేశారు.  

ఇలా ఏ రాష్ట్రానికి వెళితే, అక్క‌డి ప్ర‌భుత్వాల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం బీజేపీ నేత‌ల‌కే చెల్లింది. కేవ‌లం ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమితమ‌వుతూ, చ‌ర్య‌ల విష‌యంలో వెనుకంజ వేయ‌డం వ‌ల్లే మోదీ స‌ర్కార్ విశ్వ‌స‌నీయ‌త‌పై ప్ర‌జ‌ల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. బీజేపీ అగ్ర‌నేత‌లు వ‌స్తున్నారంటే, ప్ర‌త్య‌ర్థుల‌పై బుర‌ద చ‌ల్లి వెళ్తార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదంతా రాజ‌కీయ ఉనికి చాటుకోడానికే త‌ప్ప‌, బ‌ల‌ప‌దేందుకు ఉప‌యోగ‌ప‌డ‌వ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.