రంగబలి సినిమా విషయంలో హీరో నాగశౌర్య ఫీలయినట్లు కనిపిస్తోంది. సక్సెస్ మీట్ లో నాగశౌర్య హావభావాలు, కాస్త గట్టిగానే సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చూస్తే, రంగబలి సినిమా విషయంలో వచ్చిన టాక్, వచ్చిన సమీక్షలు ఇవన్నీ కలిసి శౌర్య ను కాస్త బాధపెట్టినట్లు కనిపిస్తోంది.
కానీ సమాధానాల విషయంలో మాత్రం ఎక్కడా తడబడకుండా, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పుకువెళ్లాడు. కొన్ని కొన్ని చోట్ల శౌర్య సమాధానాలకు మీడియా నుంచి ఎదురు ప్రశ్నలు లేకుండాపోయాయి.
మహేష్ బాబు మాస్ సినిమా ప్లాప్ అయితే మళ్లీ మాస్ సినిమా చేయవద్దని అనగలరా అని ఎదురు ప్రశ్నించాడు. ఎనభై శాతం సినిమా బాగుంది. ఇరవై శాతం బాగా లేదు అన్నపుడు ఆ ఎనభై శాతం ఎంజాయ్ చేయవచ్చుగా అన్నాడు.
తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని, స్పూఫ్ ఇంటర్వూ ఎవరి క్యారెక్టర్లతో అయితే చేసామో, వారంతా బానే వున్నారని, మిగిలిన వారే వాళ్లేదో ఫీలయ్యారని ప్రచారం చేసి, ఆ ఇంటర్వూను వైరల్ చేసారని అన్నారు.
తన ప్రయత్నాలు తాను చేస్తూనే వుంటానని, సక్సెస్ అయినపుడు మళ్లీ మీరే రాస్తారని శౌర్య క్లారిటీగా చెప్పాడు. సినిమా మీడియా స్పందన తెలిసి కూడా అస్సలు సంయమనం తప్పకుండా, అలా అని తగ్గకుండా శౌర్య సమాధానాలు చెప్పాడు. కానీ టోటల్ సినేరియా గమనిస్తే రంగబలి మీద వచ్చిన టాక్, ప్రచారం మీద నాగశౌర్య కాస్త ఫీలయినట్లే కనిపిస్తోంది.