కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తన తండ్రి దివంగత వైఎస్సార్ విషయంలో కనబరిచిన ఆప్యాయతకు ఆయన తనయ, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫిదా అయ్యారు. ఇవాళ వైఎస్సార్ జయంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయకు తల్లి వైఎస్ విజయమ్మ, కూతురు, కుమారుడితో కలిసి షర్మిల వెళ్లారు. వైఎస్సార్ ఘాట్‌లో దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ గొప్పతనాన్ని కొనియాడారు. వైఎస్సార్‌కు ట్విటర్ వేదికగా రాహుల్‌గాంధీ నివాళులర్పించడంపై షర్మిల ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొదట రాహుల్‌గాంధీ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
“కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు. ఆయన చిరస్థాయిగా స్మరణీయుడు” అని రాహుల్ ట్వీట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. రాహుల్ ట్వీట్‌పై వైఎస్ షర్మిల స్పందించారు.
“డాక్టర్ వైఎస్సార్‌ని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రేమ పూర్వకమైన మీ పలుకులకు ధన్యవాదాలు రాహుల్‌గాంధీజీ. డాక్టర్ వైఎస్సార్ తెలుగు ప్రజల సేవలో దివంగతుడైన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నేత. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందని నమ్మారు వైఎస్సార్.
ఆయన సంక్షేమ విధానాలు నేటికీ దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచి ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ మీ గుండెల్లో నిలిచి ఉన్నందుకు ధన్యవాదాలు” అంటూ షర్మిల రీట్వీట్ చేయడం విశేషం. కాంగ్రెస్‌పై వైఎస్ బిడ్డ సానుకూల వైఖరితో ఉన్నారనేందుకు షర్మిల ట్వీటే నిదర్శనం. మీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తన తండ్రి వైఎస్సార్ నమ్మిన విషయాన్ని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేయడం గమనార్హం.