తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ జరుగుతోంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒక తిట్టు తిడితే, పెద్దారెడ్డి పది తిట్లు తిడుతున్నారు. ఇద్దరి నోటి దురుసుతో తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నారు. రాజకీయంగా అవాంఛనీయ మాటలు దొర్లుతున్నాయి. ఇద్దరి వైఖరిని చూస్తున్న జనం ఛీత్కరించుకుంటున్నారు.
మొదట జేసీ ప్రభాకర్‌రెడ్డి తన ప్రత్యర్థి పెద్దారెడ్డిని ఏదో ఒకటి తిట్టి గిల్లుతారు. అటు వైపు నుంచి అంతకు మించిన వాడి, వేడి మాటలతో ఘాటైన కౌంటర్ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం తాజాగా రైతులకు పంట నష్టపరిహారాన్ని అందజేస్తోంది. ఇవాళ అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి పరిహారం సొమ్మును జమ చేశారు. ఇదే తాడిపత్రిలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డి మధ్య అడ్డూఅదుపూ లేని తిట్లకు దారి తీసింది.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చెందిన ఏడాదిన్నర చీనీ తోటకు పంటల బీమా డబ్బులు కొట్టేశారని ఆరోపించారు. అంతేకాదు, ఆ మేరకు ప్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో రూ. 13.89 లక్షల సొమ్మును పెద్దారెడ్డి కొట్టేసినట్టు చెప్పుకొచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తానని…. దమ్ముంటే ఆపాలని ఆయన అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తేందుకు తాను పోతానని…. థూ నీ బతుకు చెడ అంటూ ఎమ్మెల్యే పై ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రాప్ ఇన్సూరెన్స్ రైతులందరికీ వచ్చినట్లే తనకూ వచ్చిందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియకపోవడం వల్లే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన ఎదవను ఈ రాష్ట్రంలో ఇంత వరకూ చూడలేదని విరుచుకుపడ్డారు. పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టు చూడాలని పెద్దారెడ్డి సవాల్ విసిరారు.
తనకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్షగా ఆయన చెప్పారు. ఎమ్మెల్యే పదవి లేకపోతే జేసీని ఇంటిలో నుంచి లాక్కొచ్చి చెప్పుతో కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పుతానంటూ కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రిలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల నోటి దురుసుతో రాజకీయ కాలుష్యం ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.