తెలుగు విశ్వ విద్యాలయానికి కొత్త పేరేమిటి? 

తెలంగాణ ఏర్పడిన తరువాత పేర్ల మార్పు మొదలైంది. అంటే కొన్ని సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ఏపీలో ఉన్న పేర్లను మొదటగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం మార్చింది. తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టింది. తెలంగాణ వచ్చిన…

తెలంగాణ ఏర్పడిన తరువాత పేర్ల మార్పు మొదలైంది. అంటే కొన్ని సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ఏపీలో ఉన్న పేర్లను మొదటగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం మార్చింది. తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టింది. తెలంగాణ వచ్చిన కొత్తలో మంచి ఊపు మీదున్న కేసీఆర్ చాలా మార్పులు చేయాలనుకున్నాడు.

రవీంద్ర భారతి కూలగొట్టి కొత్తది కడతానన్నాడు. దాని డిజైన్ కూడా మీడియాకు విడుదల చేశాడు. ట్యాంక్ బండ్ మీద ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగు ప్రముఖుల విగ్రహాలు పెట్టారు. అయితే తెలంగాణ వచ్చాక ఆ విగ్రహాల్లో ఆంధ్ర వాళ్ళవి తొలగించి జాగ్రత్తగా ప్యాక్ చేసి ఏపీకి పంపుతామన్నాడు. కానీ ఆయన అధికారంలో ఉన్న పదేళ్లు ఈ పనులు చేయలేకపోయాడు.

కారణం ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లు. రవీంద్ర భారతి కూలగొట్టకపోవడానికి ప్రజల్లో దానిపట్ల ఉన్న ప్రగాఢమైన సెంటిమెంట్ కారణం కావొచ్చు. అప్పట్లోనే కేసీఆర్ తెలుగు విశ్వవిద్యాలయం పేరు కూడా మారుస్తానని అన్నాడు. దాని పేరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కదా. పొట్టి శ్రీరాములు ఆంధ్ర వాడు కాబట్టి ఆ పేరు మార్చాలనుకున్నాడు. కానీ ఆగిపోయాడు.

బహుశా దీనికి ఆర్య వైశ్యుల ఓట్లు కారణం కావొచ్చు. సమాజంలో వారు బలమైన వర్గమే కాకుండా వ్యాపార వర్గం కూడా. కాబట్టి వారి నుంచి వ్యతిరేకత వస్తుందని ఊరుకున్నాడు. కానీ ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా విషయాల్లో తాను కేసీఆర్ కు మించిన వీర తెలంగాణ వాదినని చెప్పుకోవడానికి రేవంత్ తాపత్రయ పడుతున్నాడు.

అలా చేయకపోతే గులాబీ పార్టీ నాయకులు, ప్రధానంగా కేసీఆర్ అండ్ కో తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేశాడని, ఆంధ్ర వాళ్ళతో అంట కాగుతున్నాడని విమర్శిస్తారు. అందుకే సినిమా అవార్డులకు కూడా గద్దర్ పేరు పెట్టాడు. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు మీద కూడా తీవ్రంగా చర్చలు జరుపుతున్నాడట. అయితే పొట్టి శ్రీరాములు పేరు మార్చే ఆలోచనను తెలంగాణలోని వైశ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఆ ప్రయత్నాలు మానుకోవాలని అంటున్నారు. పేరు మారుపై ఆందోళన పడుతున్నామని ఆర్య వైశ్య నాయకులు చెప్పారు. వాళ్ళు ఆయన్ని ఆంధ్రవాడిగా చూడటంలేదు. ఆయనను ప్రాణ త్యాగం చేసిన గొప్ప వైశ్య నాయకుడిగా చూస్తున్నారు. ఆయన్ని తమ సామాజిక వర్గానికి ప్రతీకగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డికి కూడా చెప్పారు. కానీ కాదని మొండిగా ముందుకెళితే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇది ఎన్నికల్లో కూడా ప్రభావం చూపొచ్చు.

ఇక.. ఇదిలా ఉంటే తెలుగు యూనివర్సిటీకి ప్రాచీన కవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని ఆయన పేరుతో ఉన్న సాహిత్య సాంస్కృతిక వేదిక సీఎంను కోరుతోంది. తెలంగాణ మలి దశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈ డిమాండ్ చేస్తున్నామని ఆ వేదిక పెద్దలు చెప్పారు. ఈ డిమాండ్ వెనుక ఓ కారణం ఉండొచ్చు.

ఆంధ్ర వాళ్లకు ఆది కవి నన్నయ్య అని, కానీ తెలంగాణకు ఆది కవి పాల్కురికి సోమనాథుడని కేసీఆర్ అప్పట్లో చెప్పాడు. బసవ పురాణం వంటి గొప్ప గ్రంథం రాసిన సోమనాథుడు పక్కా తెలంగాణ వాడని చెప్పాడు. ఇంకా ఎవరేమి డిమాండ్లు చేస్తారో చెప్పలేం. మరి రేవంత్ రెడ్డి సాహితీవేత్త పేరు పెడతాడో, రాజకీయ నాయకుడి పేరు పెడతాడో, సంఘ సంస్కర్త పేరు పెడతాడో తెలియదు.

5 Replies to “తెలుగు విశ్వ విద్యాలయానికి కొత్త పేరేమిటి? ”

Comments are closed.