రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఏమిటి?

కాంగ్రెస్ పార్టీ తరఫున ఏనాటికైనా భావి ప్రధాని కాగలరని అభిమానులు అందరూ ఆశగా ఎదురు చూస్తే రాహుల్ గాంధీ అసలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా? ప్రస్తుతం పార్లమెంటు…

కాంగ్రెస్ పార్టీ తరఫున ఏనాటికైనా భావి ప్రధాని కాగలరని అభిమానులు అందరూ ఆశగా ఎదురు చూస్తే రాహుల్ గాంధీ అసలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా? ప్రస్తుతం పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా కోల్పోయి, దశాబ్దాలుగా నివాసం ఉంటున్న అధికారిక భవనం నుంచి కూడా బయటకు వచ్చేసి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాహుల్ గాంధీకి న్యాయస్థానాల్లో వాతావరణం సానుకూలంగా కనిపించడం లేదు. ఆయన అప్పీలును గుజరాత్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఇప్పుడు గుజరాత్ హైకోర్టులోనే డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలా, లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? అనే విషయంలో రాహుల్ గాంధీ మల్లగుల్లాలు పడుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరుకు సంబంధించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలైంది. విచారించిన సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత న్యాయస్థానం ఆయనకు పడిన జైలు శిక్షను హోల్డ్ చేయడంతో ప్రస్తుతానికి జైలుకు వెళ్లే ప్రమాదం తప్పించుకున్నారు. 

అయితే శిక్ష పడిన తక్షణమే ఆయన ఎంపీగా పదవి కోల్పోయారు. ఆయన నియోజకవర్గాన్ని వేకెంట్‌గా కూడా పార్లమెంటు ప్రకటించింది. రెండేళ్లు అంతకుమించిన జైలు శిక్ష పడినట్లయితే మరో ఆరేళ్ల పాటు ఎలాంటి ఎన్నికలలో పోటీ చేసే అర్హతను కోల్పోతారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ 2024 ఎన్నికలలో రంగంలోకి దిగే అవకాశం ఉందా లేదా అనే మీమాంస ఇప్పుడు నడుస్తోంది.

కోర్టు హోల్డ్ తో జైలు శిక్ష తాత్కాలికంగా తప్పించుకున్న రాహుల్ కు ఇప్పుడు న్యాయస్థానాలు మాత్రమే దిక్కు. శిక్ష పడిన వెంటనే ఆయనను ఎంపీ పదవినుంచి తొలగించడం, అధికారిక నివాసం ఖాళీ చేయించడం వంటివన్నీ అధికార బిజెపి వేధింపు చర్యలుగా రాజకీయ విమర్శలు అనేకం చేశారు గానీ.. వాటివల్ల ప్రజల్లో పెద్దగా మైలేజీ కూడా రాలేదు.

సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండు సంవత్సరాల జైలుశిక్ష రద్దయితే తప్ప రాహుల్ కు విముక్తి లేదు. హైకోర్టులో అప్పీలు చేస్తే ఫలితం దక్కలేదు. ఆ తీర్పును కొట్టివేయడానికి తగిన కారణాలు కనిపించడం లేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. 

వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ పై దేశవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు పది కేసులు వరకు నమోదయి ఉన్న సంగతిని కూడా ఈ కేసు విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు. 125 పేజీల తీర్పు వెల్లడించారు కానీ, ఆయనకు విధించిన శిక్షపై స్టే ఇవ్వడం తప్పనిసరి కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోంది. 

గుజరాత్ హైకోర్టు తీర్పు తాము ఊహించినదే అని, ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని వ్యాఖ్యానిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. సుప్రీంకోర్టు కనీసం కేసును అడ్మిట్ చేసుకోకుండా తిరస్కరిస్తే అప్పుడు కూడా ఇదే చిలక పలుకులు పలుకుతారేమో చూడాలి. మొత్తానికి రెండు విషయాలు తేలిపోయినట్లే. ఒకటి- రాహుల్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.. రెండు- వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేయడం కూడా సందేహంగానే ఉంది.