ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కసరత్తును పూర్తిస్థాయిలో ప్రారంభించారు. సుమారు ఏడాది కాలం నుంచి పార్టీని ఎన్నికల మోడ్ లోనే ముందుకు తీసుకు వెళుతున్న నాయకుడు, ఇప్పుడు అభ్యర్థుల ఖరారు పనిమీద పడ్డారు. గెలుపు గుర్రాలను ధ్రువీకరించుకోవడం మీద కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం తమ పార్టీ ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉన్నదీ, ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్చార్జిల పరిస్థితి ఏమిటనే విషయంలో.. ఆయన ఐప్యాక్ ప్రతినిధులతో తాజాగా కూడా సమావేశం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల విషయంలో తాను పూర్తిగా సర్వేల మీదనే ఆధారపడుతున్నానని, సర్వేల్లో ప్రజాదరణ బాగా ఉన్న నాయకులకు మాత్రమే టికెట్లు దక్కుతాయని ఈ విషయంలో రెండో అభిప్రాయానికి, చర్చకు తావు లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా అందరు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే వస్తున్నారు.
గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చురుగ్గా ఎమ్మెల్యేలు అందరితోను నిర్వహింపచేస్తూ.. ఆ కార్యక్రమం అమలు తీరు మీద ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రతిసారీ పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూనే ఉన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో ఆశించినంతగా పాల్గొనడం లేదని వారు తమ పనితీరు మార్చుకోకపోతే గనుక వారి అభ్యర్థిత్వం విషయంలో పునరాలోచన చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పలుమార్లు హెచ్చరించారు.
అయితే తాజాగా కూడా ఐపాక్ ప్రతినిధులతో సమావేశం అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో వేటు పడే వారి సంఖ్య 18తో ఆగుతుందా? లేదా, మరింత మంది పై వేటు తప్పదా అనే అనుమానాలు పార్టీ నాయకులకు కలుగుతున్నాయి.
అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం ఐప్యాక్ ప్రతినిధుల మీద మాత్రమే ఆధారపడి ఎమ్మెల్యేలు మీద వేటు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం సబబేనా అనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది.
ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ పార్టీ సంస్థాగత నిర్ణయాలు ప్రతిదానికి ఐ ప్యాక్ మీద ఆధారపడుతున్నారనే సంగతి సర్వవిదితం అయిపోయింది. తమ తమ నియోజకవర్గాలలో ఐపాక్ ప్రతినిధులు ఎవరో ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు. వారితో ఎమ్మెల్యేలు నిత్యం టచ్ లోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా వారిని గౌరవిస్తున్నారు.
ఐప్యాక్ ప్రతినిధులను దువ్వి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు తమ వంతు పాట్లు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల కు అనుకూలంగా ఐప్యాక్ వారు వాస్తవ విరుద్ధమైన నివేదికలు ఇచ్చే ప్రమాదం కూడా ఉంది.
ముఖ్యమంత్రి కేవలం ఒకే సంస్థ మీద కాకుండా సమాంతరంగా మరొక సంస్థ మీద కూడా ఆధారపడి సగటు నిర్ణయం తీసుకుంటే పార్టీకి లాభం జరుగుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి, వేర్వేరు సంస్థల సేవలను పరిగణనలోకి తీసుకున్న జగన్ ఈ దఫా కూడా కేవలం ఐప్యాక్ మీద మాత్రమే ఆధారపడకుండా.. సమాంతర సర్వేలు, తన సొంత వివేచనను కూడా ఉపయోగిస్తే పార్టీకి ఎక్కువ లాభం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.