ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం సొంత జిల్లాకు ఇవాళ వెళుతున్నారు. శనివారం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయనకు వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనకు సీఎం వెళుతున్నా… ఒకప్పటి ఉత్సాహం వైసీపీలో కనిపించడం లేదు.
సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటనపై వైసీపీ నాయకుల్లో నిరుత్సాహం నెలకుందనడానికి జగన్ సొంత పత్రిక సాక్షి జిల్లా సంచికలో చెప్పుకోతగ్గ స్థాయిలో యాడ్స్ కనిపించకపోవడమే ఉదాహరణ. సాక్షి టాబ్లాయిడ్‌లో ఫస్ట్ పేజీలో జగన్ రాకను పురస్కరించుకుని కనీసం చిన్న అడ్వర్‌టైజ్‌మెంట్ కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. లోపలి పేజీల్లో కూడా అంతంత మాత్రమే. పులివెందుల జోన్‌లో ఫర్వాలేదనిపించారు.
సీఎంగా జగన్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఒకప్పుడు వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పులివెందుల వాసులకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం వుండేది. కానీ ఇప్పుడు పులివెందుల వాసులకు అపాయింట్‌మెంట్ లేదు. ఏదైనా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ద్వారా జరగాల్సిందే. అవినాష్‌రెడ్డిని కలవడం అంత సులువు కాదు. దీంతో పులివెందుల వాసుల్లో ఒక రకమైన నిరుత్సాహం ఉంది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో పులివెందుల వాసులు సంబరపడ్డారు.
జగన్ పులివెందులకు వస్తే వీధులన్నీ జనంతో నిండిపోయేవి. ఇప్పుడు వీధుల్లో బారికేడ్లు కడుతుండడంతో మనకెందుకులే అని జనం అటు వైపు వెళ్లడమే మానేశారు. జగన్ సీఎం అయిన తర్వాత మనకు ఒరిగింది ఏమీ లేదని కొందరు నాయకులు మౌనాన్ని ఆశ్రయించారు. దీంతో జగన్ వస్తున్నారంటే… మునుపటి ఉత్సాహం, ఆసక్తి పులివెందుల్లో నాయకులు, కార్యకర్తల్లో లేదనేది వాస్తవం.