నాలుగు మెగా సినిమాలు నెల రోజుల గ్యాప్ లో వస్తున్నాయి. అంటే మెగా ఫ్యాన్స్ తమ నెల పాకెట్ మనీ నుంచి 1500 ఈ నాలుగు సినిమాలకు పక్కన పెట్టేయాల్సిందే. కానీ ఎంత మెగా ఫ్యాన్స్ అయినా నాలుగు సినిమాలు చూస్తారా? అంటే.. కంటెంట్ మీద ఆధాపడి వుంటుంది అన్నది వాస్తవం.
నాలుగు సినిమాల్లో మొదటిగా వస్తున్న బ్రో సినిమాకు బజ్ వుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరు మెగా హీరోలు పవన్-సాయి ధరమ్ తేజ్ వున్నారు. త్రివిక్రమ్ పేరు యాడ్ అయింది. పైగా పవన్ సినిమా రావడం అంటే కాస్త హడావుడి వుంటుంది. అందువల్ల మొదటిగా వచ్చే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఫిక్స్.
ఇక ఈ సినిమా తరువాత వచ్చే మెగాస్టార్ భోళాశంకర్. ఈ సినిమాకు ఇప్పటికి ఇనఫ్ బజ్ అయితే లేదు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పెద్దగా హోప్ పెట్టుకోలేదు. చాలా అండర్ రేటింగ్ తో వస్తోందీ సినిమా. అందువల్ల బాగుంది అనిపించుకుంటే చాలు అందరి దృష్టి అటు మళ్లుతుంది. లేదూ అంటే మెగాస్టార్ సినిమా అయినా పక్కన పెట్టేయడం పక్కా. గతంలో ఇలా జరిగిన ఉదాహరణలు వున్నాయి.
ఈ రెండు సినిమాల తరువాత వరుసగా వస్తున్న వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ సినిమాల మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. కంటెంట్ బయటకు వచ్చిన తరువాతే భవిష్యత్ తెలుస్తుంది. ఎందుకంటే ఉప్పెన తరువాత వైష్ణవ్ కొట్టిన హిట్టూ లేదు. గట్టిగా లాగిన ఓపెనింగూ లేదు. అందువల్ల ఆదికేశవ సినిమా ఆ లోటు తీర్చాలంటే ప్రీ రిలీజ్ కంటెంట్ సరైనది రావాలి. ఇప్పటి వరకు టీజర్ మాత్రమే వచ్చింది. సాంగ్స్ ఇంకా రావాల్సి వుంది. ఆపై ట్రయిలర్ వచ్చి బజ్ పెంచాల్సి వుంది. భోళా కనుక బాక్సాఫీస్ దగ్గర విఫలమైతే వైష్ణవ్ సినిమాకు అడ్వాంటేజ్ అవుతుంది.
ఆఖరున వస్తోంది వరుణ్ తేజ్-గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ కాంబినేషన్ మీద పెద్దగా ఆశలు లేవు. పైగా ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి అయితే ఇప్పటి వరకు జనరేట్ కాలేదు. ముందుగా విడుదలయ్యే మూడు సినిమాల రిజల్ట్, ఈ సినిమా టాక్ ను బట్టే వుంటుంది వ్యవహారం.
నిర్మాతల పరంగా చూసుకుంటే బ్రో సినిమా మంచి బిజినెస్ చేసుకుంది. హీరో పవన్, సినిమా సెట్ చేసిన త్రివిక్రమ్ మాంచి లాభాలు అందుకున్నారు. పారితోషికం ప్లస్ లాభాల్లో వాటాలు. వీరు తీసుకోగా మిగిలిన సగాన్ని జీ సినిమా, పీపుల్స్ మీడియా పంచుకోవాల్సి వుంటుంది. సినిమా నిర్మించామనే తప్ప, పీపుల్స్ మీడియాకు మిగిలేది చాలా తక్కువే.
భోళాశంకర్ సినిమా బిజినెస్ ఇంకా పూర్తిగా క్లోజ్ కాలేదు. నైజాం స్వంతంగా విడుదలకు సిద్ద పడుతున్నారు. ఆంధ్రలో ఏజెంట్ లాస్ లెక్కలు తేలాల్సి వుంది.
ఆదికేశవ సినిమా మిగిలిన మూడు సినిమాల కన్నా లాభాల పరంగా చూసుకుంటే బెటర్ వన్. ఎందుకంటే ఈ సినిమా ఖర్చు, నాన్ థియేటర్ ఆదాయం లెక్కలు చూసుకుంటే థియేటర్ బర్డెన్ ఎక్కువగా లేదు.
వరుణ్ తేజ్ సినిమాకు మరీ ఇబ్బందికరమేమీ కాదు నిర్మాతకు.
ఇలా నెల రోజుల గ్యాప్ లో అయిదుగురు మెగాహీరోల నాలుగు సినిమాల లెక్కలు తేలబోతున్నాయి.