ఆయన సర్దుకుపోయాడు.. ఈయన కత్తి దూశాడు

నెల్లూరులో కాకాణి, అనిల్ ఒకేరోజు తలబడబోతున్నారు, ఏదో జరుగుతోంది, ఏం జరుగుతుంది.. అని మీడియా ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ చివరకు ఏమీ జరగలేదు. అనిల్ సభపై అంత రాద్ధాంతమెందుకు, అది పార్టీ మేలు…

నెల్లూరులో కాకాణి, అనిల్ ఒకేరోజు తలబడబోతున్నారు, ఏదో జరుగుతోంది, ఏం జరుగుతుంది.. అని మీడియా ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ చివరకు ఏమీ జరగలేదు. అనిల్ సభపై అంత రాద్ధాంతమెందుకు, అది పార్టీ మేలు కోసం చేస్తున్న పనే కదా అని కాకాణి సర్దిచెప్పగా, అనిల్ మాత్రం తన సభలో కత్తి దూసి నాకు నేనే సాటి, నాతో నాకే పోటీ, తగ్గేదే లే అంటూ నాలుగు సినిమా డైలాగులు వేశారు. 

స్టేజ్ పై కూడా కాకాణి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు తప్ప మిగతా అందరి పేర్లు చెప్పి పరోక్షంగా వారిని గిల్లారు. అంటే ఈ గొడవ ఇక్కడితో ఆగేలా లేదు. కాకాణి సైలెంట్ గా ఉన్నా.. భవిష్యత్ లో ఆయన అనిల్ తో సర్దుకుపోతారని చెప్పలేం.

ఎదురు పడితే ఏం జరిగేదో..?

నెల్లూరు జిల్లా కేంద్రంలో ర్యాలీ జరపాలనేది కాకాణి అభిమానుల కోరిక. కానీ అదే రోజు సభ పెట్టుకుని నెల్లూరు నగరంలో కాకాణిని అడుగు పెట్టకుండా చేశారు అనిల్. మినీ బైపాస్ మీదుగా పార్టీ ఆఫీస్ కి వచ్చిన కాకాణి అక్కడ పార్టీ నేతలతో సమావేశమై వెళ్లిపోయారు. మధ్యలో అనిల్ సభపై స్పందించారు కానీ, అస్సలు ఎక్కడా మాట తూలలేదు. 

పార్టీ కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మీడియా తప్పుగా చూడటం సరికాదన్నారు. సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకొని వెళ్తానన్నారు. తన శాఖకు వన్నె తెస్తానన్నారు. అయితే సభ సందర్భంగా అనిల్ తరపున కూడా భారీగా కార్లు, బైక్ లతో ర్యాలీ జరిగింది. వీరిద్దరి ర్యాలీలు ఎదురు పడితే ఏం జరిగేదోనన్న అనుమానం కూడా స్థానిక పోలీసుల్లో ఉంది. 

అందుకే వారు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ భారీగా పోలీసుల్ని మోహరించారు. ఒకరి ఏరియాలోకి, ఇంకొకర్ని రానీయకుండా కట్టడి చేశారు. చివరకు ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించారు.

పైకి ప్రశాంతత.. లోపల నివురు గప్పిన నిప్పు..

అనిల్ తన ఆత్మీయ సభలో పేరు పేరునా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల పేర్లు చెప్పి మరీ మంత్రిగా పనిచేసినప్పుడు తనకు అందించిన సహాయ సహకారాలకు థ్యాంక్స్ చెప్పారు. కానీ కాకాణి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. 

జిల్లాలో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలని, వారిని పొగడాలని, వారిచ్చిన సహకారాన్ని కొనియాడాలని ఎవరూ బలవంతపెట్టరు కానీ.. అనిల్ ఆ పేర్లను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టడమే మరోసారి వివాదానికి తావిస్తోంది. 

తనది బలప్రదర్శన కాదంటూనే తగ్గేదేలేదన్నారు, నాకు నేనేపోటీ అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పారు. జిల్లాలో ఎవరైనా జగన్ బొమ్మపైనే గెలవాలంటూ వైరి వర్గాన్ని కాస్త రెచ్చగొట్టారు. అభిమానులు ఇచ్చిన కత్తి దూశారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత పెట్టిన సభ అసలు ఈ రేంజ్ లో ఉంటుందా అనేలా చేశారు అనిల్.

సందట్లో సడేమియా..

నిన్నమొన్నటి వరకూ మంత్రి పదవి రాలేదని కన్నీళ్లు పెట్టుకుని, ఆ తర్వాత అనిల్ తో భేటీ అయి జిల్లాలో కొత్త వర్గాన్ని సృష్టిస్తున్నారనుకున్ననెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు సర్దుకున్నారు. 

తనకు అనిల్, కాకాణి ఇద్దరూ సమానమేనంటున్నారు. కాకాణి కార్యక్రమానికి తన తమ్ముడ్ని పంపించి సర్దుబాటు చేసుకున్నారు. అనిల్ వర్గంగా భావించే కొంతమంది నాయకులు కూడా ఆయన సభకు దూరంగా ఉండటం విశేషం.

మొత్తమ్మీద కాకాణి ఎంట్రీ పైకి సౌమ్యంగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం రాజకీయ చిచ్చు రేపింది. నెల్లూరు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి.