భారతదేశంలో సంగీతానికి మేస్ట్రో ఎవరంటే వినిపించే ఒకే ఒక పేరు ఇళయరాజా. ఆయన అమాయకుడని, భోళా శంకరుడని, పెద్దగా ఎవరినీ కాకా పట్టడం రాదని, సింపుల్ లివింగ్ అనీ.. ఇలా చాలా చాలా వినిపిస్తుంటాయి. ఆమధ్య తనకు హక్కులు దఖలు పడ్డ పాటల్ని స్టేజ్ పై పాడారంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కోర్టు నోటీసులు పంపించినప్పుడు మాత్రం మేస్ట్రో ఇలా కూడా ఆలోచిస్తారా అని కొంతమంది మధనపడ్డారు. ఆయనకు న్యాయం, సంగీతం రెండు కళ్లలాంటివని సరిపెట్టుకున్నారు.
కానీ ఇప్పుడు ఏకంగా ఇళయరాజా బంపరాఫర్ కొట్టేశారు. రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారు. పెద్దపెద్దోళ్లకే రాజ్యసభ దక్కడం మామూలు విషయం కాదు, కోట్లు కుమ్మరించి మరీ ఆ సీట్ కైవసం చేసుకుంటారని వినికిడి. అలాంటిది ఇటీవల ప్రధాని మోదీపై ఓ స్తోత్రం చదవి ఏకంగా రాజ్యసభలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇళయరాజా. త్వరలో రాష్ట్రపతి, మేస్ట్రోని రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారట.
సంగీత, సాహిత్య, వైజ్ఞానిక, ఆర్థిక రంగాలకు చెందిన 12మంది ప్రముఖులను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. తమిళనాడు నుంచి సుబ్రహ్మణ్య స్వామిని ఇలాగే బీజేపీ రాజ్యసభకు పంపించింది. ఆయన పదవీకాలం పూర్తవుతున్న సమయంలో ఆయన స్థానంలో తమిళనాడు నుంచి ఇళయరాజా పేరు వినిపిస్తోంది. అయితే ఈ పేరు బయటకు రావడానికంటే ముందు ఇళయరాజా మోదీపై చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
మోదీని అంబేద్కర్ తో పోలుస్తూ ఇటీవల ఇళయ రాజా ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయాలను మోదీ నెరవేరుస్తున్నారని అన్నారు. అంబేద్కర్-మోదీ అనే పుస్తకానికి ముందుమాటలో ఈ వ్యాఖ్యానం చేశారు ఇళయరాజా. దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది. ఇళయరాజా వ్యాఖ్యల్ని బీజేపీ వైరి వర్గాలు తిప్పికొట్టాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం ఇళయరాజాకి మద్దతుగా నిలిచారు.
ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడటంతో ఆ స్థానాన్ని పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ దశలో తమిళుల్ని ప్రసన్నం చేసుకోడానికే ఇళయరాజాకు అవకాశమిస్తున్నారని తెలుస్తోంది. ఒకరకంగా మోదీపై ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు కారణమని అంటున్నారు. అయితే ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.