తెలంగాణలో మరో పరువు హత్య

సంచలనం సృష్టించిన నల్గొండ పరువు హత్యను తెలంగాణ ప్రజానీకం మరవకముందే అలాంటిదే మరో పరువు హత్య చోటు చేసుకుంది. తన కులం కాని వ్యక్తిని కూతురు ప్రేమించిందనే కోపంతో.. రెండేళ్లుగా కాచుక్కూర్చున్న ఆ తండ్రి,…

సంచలనం సృష్టించిన నల్గొండ పరువు హత్యను తెలంగాణ ప్రజానీకం మరవకముందే అలాంటిదే మరో పరువు హత్య చోటు చేసుకుంది. తన కులం కాని వ్యక్తిని కూతురు ప్రేమించిందనే కోపంతో.. రెండేళ్లుగా కాచుక్కూర్చున్న ఆ తండ్రి, అల్లుడ్ని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. పోలీసులు ఛేదించిన ఈ కేసులో పలు ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రామకృష్ణ, వలిగొండలో హోం గార్డుగా చేసేవాడు. తర్వాత భువనగిరికి బదిలీ అయ్యాడు. అక్కడకు దగ్గర్లోనే ఇల్లు తీసుకొని ఉండేవాడు. తనకు సమీపంలోనే వెంకటేష్ ఉండేవాడు. ఆమె కూతురు భార్గవితో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది.

వీళ్ల ప్రేమ విషయం వెంకటేష్ కు తెలిసింది. రామకృష్ణతో పాటు భార్గవిని పలుమార్లు హెచ్చరించాడు. కానీ భార్గవి తండ్రి మాట వినలేదు. రామకృష్ణను పెళ్లి చేసుకుంది. 2020 ఆగస్టులో వీళ్ల పెళ్లి జరిగింది. అప్పట్నుంచి రామకృష్ణపై కక్ష పెంచుకున్నాడు వెంకటేష్. పలుమార్లు హత్య చేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో 2 సార్లు కూతుర్ని ఇంటికి కూడా తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది.

అంతకంటే ముందు.. రామకృష్ణ హోంగార్డు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తుర్కపల్లి మండలం వెలుగుపర్తిలో గుప్తనిధుల త్రవ్వకాలతో రామకృష్ణకు సంబంధం ఉందని, స్వయంగా వెంకటేష్ పోలీసులకు చెప్పడంతో, అతడ్ని సస్పెండ్ చేశారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత పెరిగాయి.

హోంగార్డు ఉద్యోగం కోల్పోయిన రామకృష్ణ, రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. ఈనెల 15న అమృతయ్య అనే వ్యక్తితో కలిసి భువనగరిలోని తన ఇంటి నుంచి బయటకెళ్లాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికిరాలేదు. అనుమానం వచ్చిన భార్గవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అమృతయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రామకృష్ణ హత్యకు గురయ్యాడని తెలుసుకున్నారు. దీని వెనక సిద్ధిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్ ఉందని గుర్తించారు.

లతీఫ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, ఈ మొత్తం వ్యవహారానికి భార్గవి తండ్రి, రామకృష్ణ మామ వెంకటేష్ కారణమని తెలిసింది. అల్లుడ్ని చంపేందుకు లతీఫ్ గ్యాంగ్ కు 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చాడట వెంకటేశ్. ఈ కేసును ఛేదించిన పోలీసులు, హత్యలో 11 మందికి హస్తం ఉన్నట్టు తేల్చారు.