ఆర్ఆర్ఆర్..కెజిఎఫ్…రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్

ఏ వ్యాపారంలో అయినా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ అన్నది కీలకం. ఎంత పెట్టుబడి పెట్టాం. ఎంత లాభం వచ్చింది అన్నది ముఖ్యం. రూపాయి పెడితే పది రూపాయలు రావడం వేరు, తొమ్మిది రూపాయలు…

ఏ వ్యాపారంలో అయినా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ అన్నది కీలకం. ఎంత పెట్టుబడి పెట్టాం. ఎంత లాభం వచ్చింది అన్నది ముఖ్యం. రూపాయి పెడితే పది రూపాయలు రావడం వేరు, తొమ్మిది రూపాయలు పెడితే పది రూపాయలు సంపాదించడం వేరు. అన్నివ్యాపారాల్లో ఈ సూత్రాన్ని చూస్తారు. కానీ సినిమాల్లో మాత్రం అదేంటో అస్సలు పట్టించుకోరు. మెహర్బానీ మాత్రమే కీలకం ఇక్కడ.

అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు అయిన ఖర్చెంత…లాభం ఎంత? అదే సినిమా రీమేక్ భీమ్లా నాయక్ ఖర్చు ఎంత, లాభం ఎంత? వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి పట్టుమని పది కోట్లు లాభం రాకుంటే ఆ ప్రాజెక్టు ఎందుకు?

ఆర్ఆర్ఆర్/కెజిఎఫ్ 2 విషయానికి వస్తే ఏది బయ్యర్లకు లాభం అంటే ముమ్మాటికి, నూటికి నూరుశాతం కెజిఎఫ్ నే. విడుదలకు ముందు పెట్టుబడి అది కూడా రిస్క్ లేకుండా రిటర్న్ బుల్ పెట్టుబఢి పెట్టారు. హ్యాపీగా 7 నుంచి 9 శాతం కమిషన్ అందుకుంటున్నారు. పైగా ఇచ్చిన పెట్టుబఢి విడుదలైన మూడు రోజుల్లో మూడు వంతుల వచ్చేసింది. అలా అని పెట్టుబడి ఏళ్ల తరబడి పెట్టుకుని కూర్చో లేదు, కోట్లకు కోట్లు వడ్డీలు కట్టుకోలేదు. 

చాలా మందికి పెద్దగా తెలియని విషయం ఏమిటంటే కెజిఎఫ్ 2 నిర్మాతలు ఆరంభం ఓ రేంజ్ మొత్తాలు అడిగారు. అది కూడా రిటర్న్ చేసే పద్దతిలోనే. కానీ లాస్ట్ మినిట్ లో దాన్ని 40 శాతం తగ్గించేసి, అరవై శాతమే తీసుకున్నారు. అంటే విశాఖ 6 కోట్లు, ఈస్ట్ 4.5 కోట్లు, వెస్ట్ 3 కోట్లు ఇలా. దాంతో ఏమయింది. తొలి వీడెండ్ లోనే 70 శాతం రికవరీ అయిపోయారు. వడ్డీల బాధ లేదు. 

కానీ ఆర్ఆర్ఆర్ కు అలా కాదు. కోట్లకు కోట్లు రెండేళ్ల ముందుగా ఇచ్చి కూర్చున్నారు. వడ్డీలు కట్టుకున్నారు. రూపాయి డిస్కౌంట్ ఇవ్వలేదు. బ్రేక్ ఈవెన్ కోసం ఆంధ్రలోని బయ్యర్లు కిందా మీదా అవుతున్నారు. బ్రేక్ ఈవెన్ కావచ్చు. కానీ ఖర్చులు, వడ్డీలు? ఇంత వ్యాపారానికి రూపాయి కమిషన్ కూడా కిట్టుబాటు కాదు. ఇంకెందుకు ఆ వ్యాపారం. చేసామన్న పేరుకు తప్పిస్తే..

''మాకు కెజిఎఫ్ లో వస్తున్న లాభాలు ఆర్ఆర్ఆర్ వడ్డీలకు పోతాయి'' అన్నారు ఆంధ్రలోని ఒక ఏరియాకు రెండూ డిస్ట్రిబ్యూట్ చేసిన ఓ బయ్యర్. ఆంధ్రలోనే కాదు. ఓవర్ సీస్ లో చూస్తే 13 నుంచి 14 మిలియన్లు చేసింది. కానీ లాభం ఎంత? అదే 12 కోట్లకు చేసిన కెజిఎఫ్ ఇప్పటికే మూడు మిలియన్లు చేసి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. హ్యాపీగా కమిషన్ సంపాదించుకోవచ్చు.

ఇవన్నీ అలా వుంచితే ఆర్ఆర్ఆర్ వల్ల నష్టపోయిన కిందిస్థాయి సెకండరీ, ధర్డ్ పార్టీ బయ్యర్ల గోడు వర్ణనాతీతం. ఎవరికీ చెప్పుకోలేరు. అఫీషియల్ కాదు. ఓవర్ సీస్ నుంచి ఆంధ్ర వరకు అదే పరిస్థితి. అందుకే ఇప్పటికయినా సినిమా జనాలు కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ అన్నది చూసుకోవడం నేర్చుకోవాలి. ఓ పెద్ద సినిమాలు చేసేసాం అని సంబరపడితే కాదు.