రాధేశ్యామ్ రిలీజైన వెంటనే ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు. అప్పటికే గాయంతో బాధపడుతున్న ఆయన అక్కడ సర్జరీ చేయించుకున్నాడు. కొన్ని రోజులకు ఇండియా తిరిగొచ్చాడు. హైదరాబాద్ లోనే ఇంట్లో నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ తాజాగా ఈ మేటర్ లో ట్విస్ట్ ఏంటంటే.. అసలు ప్రభాస్ ఇండియాలోనే లేడంట. విదేశాల్లో ఉన్నాడంట.
రీసెంట్ గా ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దానికి చలాన్లు వేశారు. దీంతో ప్రభాస్ కారుపై 3 చలాన్లు అంటూ చాలా కథనాలొచ్చాయి. వీటికి చెక్ పెట్టేందుకు, అది ప్రభాస్ కారు కాదంటూ వివరణ ఇచ్చుకుంది అతడి టీమ్. ప్రభాస్ బంధువు నరసింహరాజుకు చెందిన కారుగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పత్రాల్ని కూడా పోలీసులకు అందించారు.
ఇక్కడితో ఆగితే సరిపోయేది. పోలీసులు అడ్డుకున్న కారులో ప్రభాస్ లేడని, అసలు ప్రభాస్ ఇండియాలోనే లేడంటూ అతడి సన్నిహితులు స్టేట్ మెంట్లు ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. మొన్నటివరకు ప్రభాస్, హైదరాబాద్ లోనే తన నివాసంలోనే ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా స్టేట్ మెంట్ రావడంతో ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ ప్రభాస్ ఎక్కడున్నాడు? ఇప్పుడేం చేస్తున్నాడు? అతడి కొత్త సినిమాల పరిస్థితేంటి? ఇలాంటి క్వశ్చన్ మార్కులు చాలా రావడంతో, అతడి టీమ్ మరోసారి రియాక్ట్ అయింది.
ఈసారి సలార్ సినిమాను తెరపైకి తీసుకొచ్చింది ప్రభాస్ టీమ్. మే 1 నుంచి సలార్ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడట. గ్యాప్ ఇవ్వకుండా ఆ సినిమాను పూర్తిచేస్తాడనేది తాజా సమాచారం. మరో విధంగా చూసుకుంటే.. ఈ నెలంతా ప్రభాస్ కనిపించడన్నమాట. ఎక్కడున్నాడో చెప్పరన్నమాట. అంతేగా..అంతేగా..!