కలెక్షన్ల రికార్డుల సంగతెలా ఉన్నా.. ప్రేక్షకుడిని కట్టిపడేయమే సినిమా విజయంలో కీలకం అనుకుంటే, ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ అనుకున్నంత, ఊహించినంత, అంచనాలకు తగ్గట్టుగా లేదనేది స్పష్టం అవుతున్న అంశం.
భారీ బడ్జెట్లు, రెండేళ్లకు పైగా మేకింగ్ టైమ్, ఇద్దరు స్టార్ హీరోలు.. వీటన్నింటికీ తగ్గ ఔట్ పుట్ కాదు ఆ సినిమా. ఈ విషయాలను ప్రస్తావిస్తే కొంతమంది మీద పడి రక్కేస్తారు! ఆ సినిమా సూపర్ అని ఒప్పుకుంటే తప్ప వారు ఒప్పుకోరంతే!
వారి సంగతెలా ఉన్నా.. ఒకవేళ కేజీఎఫ్ పార్ట్ టూ తర్వాత ట్రిపుల్ ఆర్ విడుదల అయి ఉంటే.. ? అనేది ఒక ధర్మ సందేహం! ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడంలో కేజీఎఫ్ ఊపేస్తోంది.
ఫస్ట్ పార్ట్ చూశారా, చూడలేదా.. అనే అంశంతో నిమిత్తం లేకుండా కేజీఎఫ్ 2 అదరగొడుతూ ఉంది. ప్రేక్షకులను తన ట్రాన్స్ లోకి తీసుకెళ్లడంలో కేజీఎఫ్ 2 వందకు వంద శాతం విజయవంతం అవుతోంది!
ఆర్ఆర్ఆర్ ను చూసిన కళ్లతో, కేజీఎఫ్ 2 ను వీక్షించిన వారు చెప్పే మాట ఏమిటంటే, కేజీఎఫ్ 2 ముందు ట్రిపుల్ ఆర్ తేలిపోతోందనేది! ఈ వరస అలా జరిగింది కాబట్టి సరిపోయింది.
ఒకవేళ కేజీఎఫ్ 2 ముందే విడుదలై ఉంటే.. ఈ మజాను ఆస్వాధించి, ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ చూసి ఉంటే, కచ్చితంగా ఇంతేనా.. అనే భావన కలిగేది!
కేజీఎఫ్ 2 కన్నా ట్రిపుల్ ఆర్ ముందే విడుదలైపోవడం రాజమౌళి సినిమాకు చాలా మేలు చేసినట్టుగా ఉంది. కేజీఎఫ్ 2 ముందుగానే వచ్చి, ప్రేక్షకులను కొత్త హైట్ కు తీసుకెళ్లి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చి ఉంటే.. కటకటా.. అనుకోవాల్సి వచ్చేదేమో!.
మొత్తానికి కేజీఎఫ్ సెకెండ్ పార్ట్ కన్నా ఆర్ఆర్ఆర్ ముందే రావడం.. దాన్ని కాస్త సేఫ్ జోన్లో ఉంచినట్టుంది!