దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకే రోజు రెట్టింపు స్థాయికి చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో అంతకు ముందు రోజుతో పోలిస్తే ఏకంగా కేసుల సంఖ్య 90 శాతం పెరిగింది! ప్రధానంగా ఉత్తరాదిన కేసుల సంఖ్య వేగంగా పెరగడం గమనార్హం.
గత వారంలోనే ఢిల్లీలో కేసుల సంఖ్యలో పెరుగుదల వేగంగా ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. మూడో వేవ్ తగ్గుముఖం పట్టిందనుకున్న తరుణంలో.. ఈ పెరుగుదల వార్తలు కాస్త ఆందోళన రేపుతున్నాయి. మూడో వేవ్ ముందుగా తగ్గుముఖం పట్టింది ఢిల్లీలోనే. మిగతా దేశంతో పోల్చినా.. దేశరాజధాని పరిధిలో మూడో వేవ్ కాస్త ముందుగానే ముగిసింది.
ఇప్పుడు సరిగ్గా ఢిల్లీతో మొదలుకుని.. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కాస్త పెరిగింది. ముందు రోజు వెయ్యి స్థాయిలో కేసులు నమోదు కాగా, రెండో రోజు కేసుల సంఖ్య 1900 స్థాయిని దాటింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య మళ్లీ కాస్త పెరిగినట్టుగా అయ్యింది.
ఇటీవలే రోజువారీ కేసుల సంఖ్య రెండేళ్ల అల్ప స్థాయిని చేరింది. రోజువారీ కేసుల సంఖ్య ఏడెనిమిది వందల కన్నా తక్కువ స్థాయికి చేరడంతో.. రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరింది కరోనా కేసుల సంఖ్య. అలా పక్షం రోజులు అయినా పరిస్థితి కొనసాగకుండానే… ఇంతలోనే కేసుల సంఖ్య మళ్లీ రెండు వేల స్థాయిని అందుకుంటూ ఉండటం గమనార్హం.