రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడదాం. వారి బూతుల ట్వీట్ లు, మాటలను కాస్త పక్కన పెడదాం. శ్రీశ్రీ చెప్పినట్లు పబ్లిక్ బతుకులు పబ్లిక్ నే. ఎవరైనా ఏదైనా అనేస్తారు. కానీ ఎదుటవారు అంటే మళ్లీ ఒప్పుకోరు.
తెలుగుదేశం అనుకూల మీడియానే చూడండి. వీలు దొరికినపుడల్లా షర్మిల-జగన్ ఎడమొహం పెడమొహం అని అంటూనే వుంటుంది. అన్నా చెల్లెలు మధ్య బంధాలు వీడి పోయాయి అని గుర్తు చేస్తూనే వుంటుంది. నిజానికి పెళ్లి అయిపోయిన తరువాత అన్న కుటుంబం వేరు. చెల్లెలు కుటుంబం వేరు. బంధాలు వుంటాయి. ప్రేమలు వుంటాయి తప్ప అంతకు మించి వుండవు.
నందమూరి బాలకృష్ణ నేరుగా వెళ్లి పురంధ్రీశ్వరి ఇంటి ముందే తొడగొట్టిన సంఘటన గతంలో జరిగింది. జనాలకు గుర్తు వుంది. అంతమాత్రం చేత వాళ్ల మధ్య ప్రేమలు లేవని కాదు, బంధాలు లేవని కాదు. రాజకీయంగా బాటలు వేరు. ఇలా చాలా కుటుంబాల్లోని ఇద్దరు వేరు వేరు పార్టీల్లో వుండడం, దాని వల్ల ఎడమొహం పెడమొహంగా వుండడం సర్వ సాధారణం.
మరి పదే పదే షర్మిల సంగతి ని గుర్తు చేస్తూనే వస్తున్న మీడియా, పిల్లల చదువు కోసం దూరంగా వుంటున్న పవన్ భార్య సంగతి గుర్తు చేస్తే మాత్రం భగ్గుమంటోంది. అన్నచెల్లెళ్లు దూరంగా వుండడం వింత కాదు..విడ్డూరమూ కాదు. కానీ భార్య భర్తలు దూరంగా వుంటే వార్త అయిపోతున్న రోజులు. పైగా సెలబ్రిటీలు అంటే మరీనూ.
వీళ్లకు నచ్చిన వాళ్లను వాళ్లు టార్గెట్ చేస్తారు. వాళ్లకు నచ్చిన వాళ్లను వీళ్లు టార్గెట్ చేస్తారు. అదే జరుగుతున్న రాజకీయం ఇప్పుడు.