సాధారణంగా ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? ఈ ప్రశ్నకు ఎన్ని రకాల సమాధానాలైనా ఉండవచ్చు గానీ.. ‘మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది’ అనేది స్థూలంగా ఎవ్వరూ కాదనలేని జవాబు!
ప్రభుత్వం ఏ పనులు చేసినా సరే.. వాటన్నింటి సమష్టి ఉద్దేశం మళ్లీ అధికారంలోకి రావడం దిశగానే ఉంటుంది. అయితే.. ఇలాంటి ‘పునరధికార’ ప్రయత్నంలో ఒక్కొక్కరిది ఒక్కో వ్యూహం. మరి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటి? ఆయన గేమ్ ప్లాన్ ఏమిటి? అనే ఆలోచన అందరిలోనూ ఉండడం సహజం.
మళ్లీ అధికారం మాత్రమే కాదు.. మరో ముప్ఫయ్యేళ్ల పాటు అధికారం అనే ఎజెండాతో జగన్ పాలన పగ్గాలు చేపట్టారు. ఆయన గేమ్ ప్లాన్ ఇంకెంత పక్కాగా ఉండాలి. నిజానికి అంత సుదీర్ఘకాలపు అధికార లక్ష్యాలతో ప్రస్థానం సాగిస్తున్న ముఖ్యమంత్రి ఏయే ఎత్తుగడలు వేస్తారో, ప్రజలకు తనమీద ఏమాత్రం విముఖత ఏర్పడకుండా.. ఇంకెన్ని ఆలోచనలు చేయాలి. నిజానికి ఇతరులు కాపీ కొట్టే స్థాయిలో ఆయన వ్యూహాలు సాగుతుండాలి. కానీ వాస్తవంలో అలాగే ఉందా? ‘జగన్ ఇలా చేస్తున్నాడేందబ్బా’ అని ప్రజలు విస్తుపోయే నిర్ణయాలు రావడం లేదా? అంటే కాదని చెప్పలేం.
జగన్ వ్యూహాలు కొన్ని సాధారణ పొలిటికల్ గేమ్ ప్లాన్ కు భిన్నంగా, రివర్సులో కనిపిస్తుంటాయి కూడా. జగన్ శైలిలో అలాంటి రివర్స్ గేమ్ ప్లాన్ గురించి.. గ్రేటాంధ్ర సాధికారిక విశ్లేషణ!
అధికారంలోకి వచ్చిన వారు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం చాలా సహజం. ఎవ్వరూ దీనికి అతీతం కాదు. అయితే.. ఇలా ఆకర్షక మంత్రాలను నెమ్మదిగా ప్రారంభించి.. మళ్లీ ఎన్నికలు సమీపించే సమయానికి తారస్థాయికి తీసుకువెళతారు. తద్వారా.. సంక్షేమం మరింతగా అందుతోందనే భావనలో ఓటర్లను ఉంచాలని తపన పడతారు. కొందరు అందులో మాయోపాయాలు కూడా అనుసరిస్తారు. చంద్రబాబునాయుడు రైతెులకు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి.. దాన్ని దఫదఫాలుగా చేస్తానని విడగొట్టి, చివరకు పూర్తి చేయకుండానే పదవి దిగిపోవడం అలాంటి మాయోపాయ టక్కు టమార గజకర్ణ, గోకర్ణ విద్యలకు ఒక ఉదాహరణ.
అదే సమయంలో.. డ్వాక్రా మహిళలకు చిల్లర మల్లర సాయం అందిస్తూ.. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికీ పదివేల రూపాయల రొక్కం ఇవ్వడం అనేది అనుచితమైన తాయిలాలు పంచే టెక్నిక్కులో పరాకాష్ట. ఆ రెండూ కూడా బెడిసి కొట్టేవే. సంక్షేమాన్ని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడాన్ని అధికారంలోకి రాగానే మొదలెట్టి, క్రమంగా విస్తరించుకుంటూ, పెంచుకుంటూ పోవాలి. అది పైరెండు ఉదాహరణలకు మధ్యేమార్గంగా ఉండాలి.
జగన్ తాను అధికారంలోకి వచ్చాక ఆ పోకడనే అనుసరించారు. ఆంద్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం తీసుకువస్తానని అన్నారు. ఆ దిశగా ఒక్కటొక్కటిగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళుతున్నారు. వృద్ధులకు మూడువేల పెన్షను అన్నారు. అధికారంలోకి వచ్చాక ఏడాదికి 250 వంతున పెంచుతూ పోతున్నారు. ఇదంతా పద్ధతిగానే ఉంది. అయితే కొన్ని విషయాల్లో ఆయన రివర్స్ గేమ్ ప్లాన్ అనుసరిస్తున్నారా? అనిపిస్తోంది.
ఆ రివర్స్ గేమ్ ప్లాన్ చాలా ప్రమాదకరమైనది కూడా! అది ఒక సాహసోపేతమైన ప్రయోగం. అది వర్కవుట్ అయిందా? జగన్ రాజకీయ వ్యూహరచనా దురంధరుడిగా, సాహసిగా చరిత్రలో నిలిచిపోతారు. విఫలమైందా.. దక్కిన ఒక్క ఛాన్స్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ
ఆరోపణలు, వివాదాలు వంటి కారణాలు కాకుండా.. కేవలం పాలనలో నవ్యత కోసం, ఆ విధంగా తాను అధికారంలోకి వచ్చిననాడే తీసుకున్న విధాన నిర్ణయం కోసం పూర్తికేబినెట్ తో రాజీనామాలు చేయించి పునర్ వ్యవస్థీకరించడం అనేది ఒక ప్రయోగం. అయితే ఈ ప్రయోగం ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. జగన్ ఈ విషయంలో అనుసరించిన రివర్స్ గేమ్ ప్లాన్ ఒకటుంది. అనుభవజ్ఞులు, సమర్థులుగా గుర్తింపు తెచ్చుకున్న అనేక మందిని ఎన్నికలను ఎదుర్కోబోయే కేబినెట్లో సభ్కులుగా ఉంచకుండా.. పక్కన పెట్టడం.
జగన్ కేబినెట్ తొలికూర్పును అందరూ హర్షించారు. అప్పటికీ కొందరు సమర్థులకు చాన్సు దక్కకపోయినా.. దక్కించుకున్న వారందరూ పరవాలేదనిపించేలా కూర్పు అప్పట్లో తయారైంది. అప్పటికే అనుభవం ఉన్నవారు కొందరే. అప్పుడు కూడా చాలా మంది కొత్త మొహాలే.. కానీ వారంతా ఉద్ధండులుగా గుర్తింపు తెచ్చుకున్న కొత్తవారు! దానికి తగ్గట్టుగానే తమ గుర్తింపు మరింత పెరిగేలా వారు మంత్రులుగా పనిచేశారు. అయితే.. పునర్ వ్యవస్థీకరణలో వారు గడించిన అనుభవం, సమర్థతతో నిమిత్తం లేకుండా వారు రాజీనామాలు చేయాల్సి వచ్చింది.
కొత్త కేబినెట్ కూర్పు అనేది కులాల తూకం, సమీకరణలకు మినహా మరే ఇతర ప్రతిభలకు పెద్దపీట వేయలేదనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. మంత్రులుగా ఎవరున్నా ఎవరు లేకపోయినా.. పార్టీ గెలిస్తే అది కేవలం నా మహిమ మాత్రమే అనే అభిప్రాయం జగన్ కు ఉండవచ్చు గాక.. కానీ ఎన్నికల గోదాలోకి దిగబోయే కేబినెట్ జట్టులో చాలా వరకు కొత్త మొహాలు, అనుభవ శూన్యులు.. బాగా చేయగలరో లేదో అనే సంశయాళువులు ఉంటే ఎలా? ఓటర్ల ఎదుట పరువు పోతుంది కద. మరి ఈ జట్టుతో ఆయన ఎలా ముందుకు వెళతారో చూడాలి.
అమ్మ ఒడిలో వడపోతలు!
జగన్ సర్కారు పేద మధ్యతరగతి కుటుంబాలను అమితంగా ఆకట్టుకుంటున్న పథకాల్లో అమ్మఒడి కూడా ఒకటి. చదువుకుంటున్న పిల్లవాడు ఉన్న ప్రతి తల్లికీ ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం గొప్ప పథకం. ఇందులో రంధ్రాన్వేషణ చేసే విమర్శలను పక్కన పెట్టడం. ఈ పథకం క్లిక్ అయిందని అందరికీ తెలుసు. అయితే ఈ సంక్షేమ పథకంలో కొత్తగా వడపోతలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విద్యుత్తు వినియోగంలో 300 యూనిట్లు దాటిన కుటుంబాలకు అమ్మఒడి వర్తించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనేది ఆ వార్తల సారాంశం. అదే నిజమైతే ప్రభుత్వానికి పేరు తెస్తున్న సంక్షేమ పథకాల్లో వడపోతలు మొదలైనట్టే. ఈ వడపోతలకే కోతలు అని కూడా పేరు.
జగన్ సర్కారు వద్ద డబ్బు లేదని, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని, అయిదేళ్లు పూర్తిగా అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించడం అసాధ్యం అని చాటిచెప్పడానికి విపక్షాలు విషం కక్కుతున్న నేపథ్యంలో అమ్మఒడి పథకంలో ఇలాంటి వడపోతలు మొదలు కావడం గమనార్హం.
నిజానికి నెలకు 300 యూనిట్ల వినియోగం దాటిన వారికి మాత్రమే అమ్మఒడి ఆగుతుంది. ఆ మేరకు విద్యుత్తు వినియోగం చేయగలుగుతున్నారంటే వారు సంపన్న వర్గాల జాబితాలోకి మాత్రమే వస్తారు. ఎందుకంటే సాధారణ గృహవిద్యుత్ వినియోగంలో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వరకు ఉన్నా సరే.. నెలసరి వినియోగం 200 యూనిట్లు దాటదు. 300 దాటే కరెంటు వాడే వారు ఖచ్చితంగా ఏసీలు వాడేవారే అయి ఉంటారు. కాబట్టి సామాన్యులకు దీని ప్రభావం తెలియకపోవచ్చు. ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నట్టుగా.. ఈ వడపోత వలన అమ్మఒడి కోల్పోయేవారు చాలా పరిమితంగానే ఉండొచ్చు. కానీ పాయింట్ ఎందరు కోల్పోతున్నారు అనేది కాదు.. చేసే సంక్షేమంలో వడపోతలు, కోతలు ప్రారంభించింది అనేది మాత్రమే.
ప్రభుత్వం డబ్బుల్లేక పథకాల విషయంలో చేతులెత్తేస్తున్నదని, ఇదే తీరు ప్రతి సంక్షేమ పథకానికి వస్తుందని, అన్నింటిలోనూ కోతలు తప్పవని విపక్షాలు విషప్రచారం చేయడానికి జగన్ ఇలాంటి నిర్ణయం ద్వారా స్వయంగా ఆస్కారం ఇస్తున్నారు. ఇదంతా రివర్స్ గేమ్ ప్లాన్ లాగానే కనిపిస్తుంది. నిజానికి ఈ ఆలోచన ఏదో తొలినాడే చేసి ఉంటే.. జగన్ కు చాలా కితాబులు దక్కేవి. చాలా ఆచరణాత్మకంగా, విజ్ఞతతో పేదలకు మాత్రమే సాయం చేస్తున్నట్టు అందరూ కీర్తించేవాళ్లు. అలా కాకుండా.. ప్రతి ఒక్కరికీ అందించడం ప్రారంభించి ఇప్పుడు కోయడం మొదలెడితే భిన్నమైన సంకేతాలు వెళతాయి. అందుకే జగన్ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.
ఎందుకు జాగ్రత్త పడాలి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దక్కిన అధికారం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి స్వార్జితం. ఆయనకున్న అపరిమితమైన ప్రజాదరణ పుణ్యం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కలిపి.. చరిష్మా గల నాయకుడు ఆయన ఒక్కరే. ఏదో కులాల వారీ ఓట్లు, ఇంకేదైనా పరిమితమైన ఓట్లను ప్రభావితం చేయడం మినహా.. ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రచారానికి ఉపయోగపడేంత గట్టి నాయకులు ఆ పార్టీకి జగన్ తప్ప మరొకరు లేనే లేరంటే అతిశయోక్తి కాదు.
ఈ ప్రజాదరణ మొత్తం తన సొంతం అని, తన హవా కారణంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చాం అనే సంగతి జగన్ కు బాగా తెలుసు. ఆ విషయం ఆయన బుర్రలో సదా ఉంటుంది. పార్టీ సహచరులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనంత బిజీగా ఉంటారనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయంటే.. ఆయనలోని ఇలాంటి భావనే కారణం. అయితే తనకు మాత్రం ఇంతటి అనల్పమైన ప్రజాదరణ ఎలా దక్కిందనేది ఆయన గుర్తుంచుకోవాలి.
తిరుగులేని ప్రజాదరణ ఉన్న అసమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా మాత్రమే ఆయనను ప్రజలు గుర్తించారనే సంగతి ఆయన తెలుసుకోవాలి. రాజశేఖర రెడ్డి పట్ల పార్టీతో నిమిత్తం లేకుండా ఉండే ప్రజాదరణ ఆయన కొడుకుగా జగన్ కు లాభించింది. అయితే ఇలాంటి ‘లాభం’ ఒకసారి మాత్రమే దక్కుతుంది. పైగా ‘ఒక్క ఛాన్స్’ అనే పదంతో జగన్ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకట్టుకున్నారు. ప్రజలు ‘ఇచ్చి చూద్దాం’ అనుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు. అలాంటి వారికి ఏమాత్రం ఆశాభంగం కలగకుండా ఆయన పాలన సాగాలి. పాలనలో వికట ప్రయోగాలు ప్రజలకు చిరాకు పుట్టించాయంటే.. ఒక్క చాన్స్ ఇవ్వడానికి ఇటు మొగ్గిన యావత్తు ఓటు బ్యాంకు, ఏ మాత్రం పునరాలోచన లేకుండా మళ్లిపోతుంది. దానికి తగినట్లుగా జగన్ నిర్ణయాలు ఉండాలి.
ఎల్. విజయలక్ష్మి