ఒడిషాకు రాజన్నదొర షాక్?

ఉత్తరాంధ్ర జిల్లాలలోని లోని కొత్త ఉప ముఖ్యమంత్రిని చూసి ఒడిషా అలెర్ట్ అవుతోందా. ఆయన నియామకంతో సర్దుబాటు, దిద్దుబాటు చర్యలకు దిగుతోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే…

ఉత్తరాంధ్ర జిల్లాలలోని లోని కొత్త ఉప ముఖ్యమంత్రిని చూసి ఒడిషా అలెర్ట్ అవుతోందా. ఆయన నియామకంతో సర్దుబాటు, దిద్దుబాటు చర్యలకు దిగుతోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే కొత్తగా ఏర్పాటు అయిన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే రాజన్న దొర ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

ఆయన సాలూరు నియోజకవర్గం పరిధిలో వివాదంలో ఉన్న ఇరవై కొటియా గ్రామాలలోనూ సంబరాలు జరిగాయి. ఆ గ్రామాల వారిని ఇకమీదట పూర్తిగా ఆంధ్రాలో ఉండేలా చూస్తానని రాజన్నదొర హామీ ఇవ్వడంతో ఒడిషా ఉలిక్కిపడింది. ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ కొటియా గ్రామాలను ఏపీలో విలీనం చేసుకోవాలని చూసిన రాజన్నదొర ఇపుడు ఉప ముఖ్యమంత్రి. దాంతో ఆయన అధికార బలం తో అంత పని చేస్తారని కంగారు పడిన ఒడిషా సర్కార్ ర్ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రని కొటియా గ్రామాలకు పంపించింది.

ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో ఉన్న ఇరవై గ్రామాలలో ఒడిషా ప్రధాన కార్యదర్శి పర్యటించి అక్కడ ప్రజలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే కొటియా గ్రామల వారు మాత్రం తాము ఏపీలోనే ఉంటామని అంటున్నారు. వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పధకాలను ఇప్పటికే అందుకున్న వారంతా తాము ఏపీ పౌరులుగానే ఉంటామని అంటున్నారు. సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కూడా తాము ఏపీ సైడే అంటున్నారు.

అయితే ఒడిషాలోని రాజకీయ నాయకత్వం మాత్రం ఆ గ్రామాలు తమవే అంటోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదానికి రాజన్నదొర తనదైన మార్క్ తో చెక్ పెడతారు అని ఆశాభావంగా ఉన్నారు. మొత్తానికి రాజన్నదొర నియామకమే ఒడిషాను ఇంతలా కలవరపెట్టింది అంటే కొటియా కొట్లాటకు సై అంటున్నట్లుగానే చూడాలి అంటున్నారు.