చికుబుక్ రైలే… అదిరెను దీని స్ట‌యిలే!

1853 ఏప్రిల్ 16 మ‌న‌దేశంలో ఒక అద్భుతం జ‌రిగింది. మొద‌టిసారిగా 400 మంది ప్ర‌యాణీకుల‌తో బొంబాయిలో ఒక రైలు క‌దిలింది. అది మ‌న జీవితం, సాహిత్యం, సినిమా అన్నింటితో పెన‌వేసుకుపోయింది. Advertisement ఇండియ‌న్ స్క్రీన్‌పై…

1853 ఏప్రిల్ 16 మ‌న‌దేశంలో ఒక అద్భుతం జ‌రిగింది. మొద‌టిసారిగా 400 మంది ప్ర‌యాణీకుల‌తో బొంబాయిలో ఒక రైలు క‌దిలింది. అది మ‌న జీవితం, సాహిత్యం, సినిమా అన్నింటితో పెన‌వేసుకుపోయింది.

ఇండియ‌న్ స్క్రీన్‌పై కొన్ని వేల సార్లు రైలు క‌నిపించింది. చాలా సినిమాల్లో అన్నీ తానై క‌థ‌ని న‌డిపించింది. రైలంటే మొద‌ట గుర్తొచ్చేది షోలే, కాక‌పోతే అది గూడ్స్ రైలు. బందిపోట్లు రైలుని ఛేజ్ చేసే సీన్‌ని ఈ 40 ఏళ్ల‌లో ఎవ‌రూ కూడా ఆ రేంజ్‌లో తీయ‌లేక‌పోయారు. తెర మీద 8 నిమిషాలు క‌నిపించే సీన్‌ని 50 రోజులు తీశారు. పూనా స‌మీపంలో షూటింగ్ జ‌రిగింది. షోలే ప్ర‌త్యేక‌త ఏమంటే రైలుతో ప్రారంభ‌మైన సినిమా రైలుతోనే ముగుస్తుంది.

స‌గం సినిమా రైల్లోనే న‌డిచేది బ‌ర్నింగ్ ట్రైన్‌. న‌డుస్తున్న రైల్లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే ఏమైంది? ఈ క‌థాంశం ఎందుకో ప్రేక్ష‌కుల‌కి ఎక్క‌లేదు. థ్రిల్ మిస్స‌వ‌డ‌మే కార‌ణం.

రైలు వ‌ల్ల అన్న‌ద‌మ్ములు విడిపోవ‌డం ఒక‌ప్ప‌టి బాలీవుడ్ ట్రెండ్‌. యాదోంకి భారత్‌లో రైలు ఎక్క‌లేక త‌మ్ముడు ఆగిపోతాడు. క్లైమాక్స్‌లో విల‌న్ అజిత్ ట్రాక్‌లో కాలు ఇరుక్కుని చ‌నిపోతాడు. 1974లో వ‌చ్చిన దోస్త్‌లో “గాడీ బులార‌హాహై” రైలు మీద వ‌చ్చిన గొప్ప పాట‌ల్లో ఒక‌టి. ఆనంద్‌భ‌క్షి రాస్తే కిషోర్‌కుమార్ పాడాడు.

తెలుగు సినిమాల్లో కూడా రైలు పాత్ర త‌క్కువేం కాదు. దేవ‌దాసు ఎన్నిసార్లు చూసినా ఆఖ‌ర్లో నాగేశ్వ‌ర‌రావు “దుర్గాపురం రోడ్డు” స్టేష‌న్‌లో దిగుతున్న‌పుడు క‌న్నీళ్లు ఆగ‌వు. అతిగొప్ప స‌న్నివేశాల్లో దేవ‌దాస్ క్లైమాక్స్ ఒక‌టి.

క‌థ మొత్తం రైలు ప్ర‌యాణాన్ని బేస్ చేసుకుని న‌డ‌వ‌డం “వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్” ప్ర‌త్యేక‌త‌. మేర్ల‌పాక గాంధీ నూరు శాతం ఎంట‌ర్‌టైన్మెంట్ ఇచ్చాడు. ఈ మ‌ధ్య ధ‌నుష్‌తో “రైల్” వ‌చ్చింది. ఘోరం. రైల్వేస్టేష‌న్ అని ఇంకో సినిమా వ‌చ్చింది. అది కూడా ఘోరం.

వెంకిలో రైలు కామెడీ అదుర్స్‌. టీసీలుగా వేసిన క్యారెక్ట‌ర్ల‌లో వేణుమాధ‌వ్‌, సునీల్ ఎప్ప‌టికీ గుర్తుంటారు. సీరియ‌స్ క్యారెక్ట‌ర్ల‌లో సీతామాల‌క్ష్మి వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. స్టేష‌న్ మాస్ట‌ర్‌గా బాధ‌ని అణ‌చుకుంటూ డ్యూటీ చేస్తూ వుంటాడు.

రైలులో సీజ‌న్ పాస్ తీసుకుని కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ మ‌ధ్య ప్రేమ పుట్ట‌డం “జ‌యం” సినిమా. రైలు మీద మంచి పాట కూడా వుంటుంది. ప్లాట్‌ఫారం మీద తీసిన పాట‌లో అత్యంత హిట్ సాంగ్ చికుబుకు రైలే. దీని త‌ర్వాత “రాజా రాజాధిరాజ” పాట (ఘ‌ర్ష‌ణ‌).

1956లో వ‌చ్చిన చ‌ర‌ణ‌దాసిలో ANR, NTR క‌లిసి న‌టించారు. రైలు ప్ర‌మాదం వ‌ల్ల జ‌రిగిన సంఘ‌ట‌న‌లే క‌థాంశం. ఠాగూర్ న‌వ‌ల దీనికి ఆధారం. న‌ర‌సింహ‌నాయుడులో బాల‌కృష్ణ రైలు ఫైటింగ్ సినిమా స‌క్సెస్‌కి కీ పాయింట్‌. ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడులో రైలు ఇంజ‌న్ ఇక్కి మ‌రీ విల‌న్ల‌ని డీకొంటాడు. కానీ ఆ సినిమా ఆడ‌లేదు. లింగ‌లో ర‌జ‌నీకాంత్ కొడితే రైలు ఇనుప త‌లుపు కూడా ఊడిప‌డుతుంది.

ముంబ‌య్ రైల్వేస్టేష‌న్‌లో జ‌రిగిన బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో ది ట్రైన్ (2011) అని మ‌ల‌యాళంలో సినిమా వ‌చ్చింది. తెలుగులో కూడా డ‌బ్ అయ్యింది. భ‌లే త‌మ్ముడు (1969)లో ఎన్టీఆర్ రైల్లో మారువేషం వేసుకుని కేఆర్ విజ‌య‌తో గోపాల‌బాల అని ర‌ఫి గొంతుతో పాడ‌తాడు. 1973లో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ మూవీ బంగారుబాబులో ANR స్టేష‌న్ మాస్ట‌ర్‌.

చూడాల‌ని ఉందిలో చిరంజీవి ల‌వ్ రైల్వేస్టేష‌న్‌లోనే ప్రారంభ‌మ‌వుతుంది. వ‌ర్షంలో కూడా అంతే. మ‌ర్యాద రామ‌న్న‌లో కూడా సేమ్‌. పోకిరిలో రైల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్‌. దిల్‌వాలే దుల్హ‌నియా, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో షారూక్ ల‌వ్ అంతా రైల్లోనే. అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్ రైల్వేస్టేష‌న్‌లోనే. ఇంద్ర‌లో రైలు యాక్ష‌న్ సీన్ చాలా బాగుంటుంది. గూండాలో డూప్ లేకుండా చాలా రిస్క్ ఫైటింగ్‌ని రైలు మీద చిరంజీవి చేస్తాడు.

రిలాక్స్‌లో రైల్లో ఓపెనింగ్ సీన్‌, రాధేశ్యామ్‌లో మిడిల్‌లో వుంటుంది. పాత సినిమాల్లో మ‌ద్రాస్ సెంట్ర‌ల్ ఒక ఆక‌ర్ష‌ణ‌. పూల‌రంగ‌డులో నాగేశ్వ‌ర‌రావు స్టేష‌న్ బ‌య‌ట జ‌ట్కా తోలుతూ వుంటాడు. ఈ సీన్స్ బేగంపేట స్టేష‌న్‌లో తీశారు. అప్ప‌టి హైద‌రాబాద్ ఎలా వుందో చూడొచ్చు.

సినిమాల్లోనే కాదు, రైలు లేకుండా మ‌న జీవితంలో చాలా ఎమోష‌న్స్ లేవు. ఆప్తుల్ని రిసీవ్ చేసుకుంటున్న‌పుడు సంతోషం, వ‌దిలి వెళుతున్న‌పుడు బాధ‌, సీటు దొర‌క్క ఇబ్బందులు, చిరుతిళ్లు తిన్న ఆనందం. ఎన్నో గుర్తుంటాయి. టీ రుచి కూడా మ‌రిచిపోలేం. కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ రైలు టీ చెత్త‌గానే వుంటుంది.

బొగ్గు, డీజిల్‌, క‌రెంట్ అన్ని రైళ్లు ఎక్కేశాం. ఇక బుల్లెట్ ట్రైన్ మిగిలింది. ముందుకు వెళుతూ వుండ‌డ‌మే జీవితం, ఆగితే మృత్యువు.

-జీఆర్ మ‌హ‌ర్షి