రంగు.. రుచి.. వాసన.. చిక్కదనం తెలియాలంటే పెద్దగా కిందా మీదా అయిపోనక్కరలేదు. ఓ చుక్క నోట్లో వేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా తెలుగుదేశం ఆలోచనా విధానం, లేదా దాని మూలాల్లో వున్న సామాజిక వర్గ భావనలు, కాదూ, దాని అనుకూల మీడియా ఏమనుకుంటోంది తెలుసుకోవాలంటే కూడా పెద్దగా సర్కస్ ఏమీ చేయకనక్కరలేదు. జస్ట్ ఈ మూడు బాపతు జనాల్లో ఒక్కరిని కదిలిస్తే చాలు.
ఎందుకంటే ఈ మూడు జాబితాల మధ్య ఏమీ పెద్దగా ఒపినీయన్ తేడా వుండదు. ఈ మూడింటి మధ్య కనిపించని వైఫై వుంటుంది. సామాజిక వర్గ జనాలను కదిలించినా, సదరు మీడియాను అవలోకించినా, పార్టీ నాయకలను కదిపినా ఒకటే అభిప్రాయం వస్తుంది. ఇదెలా సాధ్యం అని విస్తుపోవాల్సిన పని లేదు. వాళ్లకు వుంటే వాట్సాప్ గ్రూపులు వాళ్లకు వుంటాయి. అందరూ ఏ అభిప్రాయం మీద వుండాలో అవి నిర్దేశిస్తూ వుంటాయి.
ఉన్నట్లుండి ఆంధ్ర భాజపా నాయకత్వాన్ని మార్చారు. మారుస్తారని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఈ మార్పు తమకు అనుకూలంగా వుంటుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తూ వస్తున్నాయి. మార్పు టైమ్ దగ్గరకు వచ్చేసరికి, తమకు అనుకూలంగా వుంటారనుకునే సత్యకుమార్ పేరు బలంగా వినిపించింది. ఎంత బలంగా అంటే, సోము వీర్రాజు ను తీసేసారు అన్న వార్త ముందు వచ్చింది. సాయంత్రానికి కొత్త పేరు ప్రకటిస్తారు అంటూ కొసరు వార్త వచ్చింది. కానీ ఈ లోగానే సత్యకుమార్ పేరు చలామణీ అయిపోయింది.
కానీ పురంధ్రీశ్వరి పేరు రావడంతో తెలుగుదేశం శ్రేణులు షాక్ కు గురయ్యాయి. ఏం జరిగి వుంటుందో అర్థం కావడానికే చాలా సమయం పట్టింది. అయినా మోడీ-షా ల స్ట్రాటజీ అర్థం కావడం లేదు. పురంధ్రీశ్వరి తెలుగుదేశం అభిమాని కాదు. సామాజక వర్గ అభిమాని అన్నది వాస్తవం. కాంగ్రెస్ మంత్రిగా వుండగా పార్టీలతో సంబంధం లేకుండా తమ వారికి సాయపడ్డారని అప్పట్లో చెప్పుకునేవారు. సో ఇప్పుడు ఆ మేరకు కమ్మ సామాజక వర్గ జనాలకు కాస్త పెద్ద పీట వేసే అవకాశం వుండొచ్చు. కానీ తెలుగుదేశంతో కలసి వెళ్లడానికి ఏ మేరకు దోహదం చేస్తారు అన్నది మాత్రం సందేహమే.
ఎన్టీఆర్ వెన్నుపోటు టైమ్ లో చంద్రబాబు మాటలకు లొంగి అటు వెళ్లిన దగ్గుబాటి కుటుంబం ఆ తరవాత అసలు విషయం అర్థమై బయటకు వచ్చింది. అప్పటి నుంచి మరి అటు చూడలేదు. వైకాపా వైపు అన్నా వెళ్లారు తప్ప తెలుగుదేశంలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు కీలకమైన సమస్య అదే. భాజపా-జనసేన-తేదేపా కలవాల్సి వుంది. ఈ కలయికకు పురంధ్రీశ్వరి తన వంతు సాయం చేయాల్సి వుంది. అలా చేస్తారా అన్నదే అనుమానం.
మోడీ-షా లకు ఇష్టమైతే పురంధ్రీశ్వరికి పెద్దగా అభ్యంతరం వుండదు అని అనుకోవచ్చు. పైగా సామాజిక వర్గం ఇప్పుడు ‘మనుటయా..మరణించుటయా’ అనేంత స్థాయిలో వుంది కనుక పురంధ్రీశ్వరి మీద ఆ మేరకు వత్తిడి వుంటుంది. పురంధ్రీశ్వరి ఈ వత్తిడిలకు తలవొగ్గి తెలుగుదేశం ఇరుకునపెట్టే ప్రయత్నం చేయకపోవచ్చు. భాజపాను ఒప్పించే ప్రయత్నం కూడా చేయచ్చు. కానీ అలా జరుగుతుందా? అన్న క్లారిటీ తెలుగుదేశం పార్టీకి కూడా లేదు. ఎందుకంటే భాజపా-తెలుగుదేశం మధ్య పొత్తు పొడవడం అన్నది అంత సులువు కాదు.
భాజపా-జనసేనలకు కలిపి కనీసం 50 సీట్లకు పైగా ఇస్తే తప్ప పొత్తు పొడవడం కష్టం. అన్ని సీట్లు ఇవ్వడం తెలుగుదేశానికి కష్టం. పురంధ్రీశ్వరి నియామకం వెనుక భాజపా ఉద్దేశం ఏమిటో తెలియడం అంత సులువు కాదు. భాజపా ఈసారి కూడా జనసేనను ఒంటరి పోరు చేయించాలని అనుకుంటోందా? ఆ విధంగా తెలుగుదేశం పార్టీని ఓడిస్తే, ఆపై జగన్ ను కట్టడి చేయడం లేదా ఆ పార్టీని చీల్చడం, ఇంకా ఏమైనా చేయడం అన్నది అంత కష్టమైన పని కాదు.
కానీ ఇక్కడ ఒకటే అనుమానం. ఇలా జరగాలంటే పవన్ కూడా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే పురంధ్రీశ్వరిని తీసుకు వచ్చారో, పవన్ కు భాజపా మీద అనుమానం తప్పదు. ఇప్పటి వరకు పవన్ కు భాజపా నుంచి వున్న ఆశ ఒకటే. సిఎమ్ పోస్ట్. కానీ పురంధ్రీశ్వరిని తీసుకువచ్చారు అంటే ఆ ఆశకు గండిపడే ప్రమాదాన్ని పవన్ ఊహిస్తారు.
భాజపా బహుశా పవన్ నుంచి తిరుగబాటు ఊహిస్తోందేమో? పవన్ భాజపాను వదిలి తేదేపా వైపు వెళ్లడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కారణం ఆయనకు రెడీగా వుంది. వైకాపాను గద్దె దింపడం కోసం ఓట్లు చీలిపోకుండా చూడడం. అందువల్ల అది ఆయనకు అది సమస్య కాదు. కానీ అప్పుడు భాజపాకు ఓ బలమైన సపోర్ట్ కావాల్సి వుంటుంది. అది 2023 ఎన్నికల కోసం కాదు. పార్టీని మును ముందు బలోపేతం చేయడం కోసం. నందమూరి కుటుంబం నుంచి సిఎమ్ అభ్యర్థిని ప్రొజెక్ట్ చేసి భాజపాను నడిపించాలన్నది ఆలోచన కావచ్చు.
ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్లు తప్ప దేనిలోనూ పక్కా సమాధానం లేదు. అందుకే తేదేపా అనుకూల మీడియా కూడా ఇప్పుడేమీ మాట్లాడడం లేదు. తొలి రోజు వేసిన వార్త తప్ప మరో వార్త లేదు. విశ్లేషణ లేదు. అంటే తెలుగుదేశం వర్గాలకు కూడా పరిస్థితి అంతుబట్టడం లేదు. పైగా పదవి స్వీకరించి రోజులు గడుస్తున్నా పురంధ్రీశ్వరి నుంచి ఒక్క సరైన స్టేట్ మెంట్ కూడా రాలేదు. అంటే అసలు అధిష్టానం మదిలో ఏముందో అన్నది ఆమెకు కూడా ఇంకా క్లారిటీ వుండి వుండకపోవచ్చు. నిజంగా క్లారిటీ వుంటే జగన్ ప్రభుత్వం మీద ఈపాటికే నిప్పులు కురిపించి వుండేవారు. ఇందుకోసం పాయింట్లు వెదుకనక్కరలేదు. కానీ అలా జరగలేదు.
తెలుగుదేశం వైపు నుంచి ఫుల్ క్లారిటీ వుంది. ఈస్ట్ వెస్ట్ మీద పవన్ దృష్టి పెట్టారు. మిగతా ప్రాంతాల మీద తేదేపా గురిపెట్టింది. భాజపా అవసరం ఏమీ తేదేపా కు లేదు. కానీ వైకాపాను ‘అన్ని విధాలా’ అడ్డుకోవాలంటే భాజపా సహకారం కావాలి. అందుకోసం ఇప్పుడు పురంధ్రీశ్వరితో చంద్రబాబుకు సయోధ్య అవసరం. ఈ ఈక్వేషన్ ఎలా వుంటుందన్నదే చూడాలి. భాజపా పురంధ్రీశ్వరికి స్వేచ్ఛ ఇస్తే కొంత వరకు చంద్రబాబు కోరిక నెరవేరవచ్చు.
ఎందుకంటే ఈ విషయంలో బాబు కు అనుకూలంగా వుండేలా పురంధ్రీశ్వరి మీద వత్తిడి మామూలుగా వుండదు. అందువల్ల భాజపా వైఖరి తెలిస్తే తప్ప క్లారిటీ అన్నది రాదు. అంతవరకు తెలుగుదేశం అనుకూల మీడియా సైలంట్ గా వుండాల్సిందే.