ఇడుపులపాయలో తన పేరుపై ఉన్న కొన్ని ఆస్తుల్ని వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి పేర్లపై బదిలీ చేశారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని శనివారం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్‌కు నివాళులర్పించేందుకు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో చేరుకున్నారు. వారి వెంట షర్మిల కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు.
కడప విమానాశ్రయం నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం ఇడుపులపాయలో షర్మిల పేరుపై ఉన్న కొన్ని ఆస్తుల్ని ఆమె కుమారుడు రాజారెడ్డి, అంజలిపై బదిలీ చేసేందుకు సమీపంలోని వేంపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షర్మిలను ప్రజలు ఆప్యాయంగా పలకరించారు. ఆమె కూడా అక్కడున్న అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఇడుపులపాయలో తల్లితో కలిసి షర్మిల, ఆమె కుమారుడు, కుమార్తె బస చేయనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు నివాళుర్పించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్తారు. అక్కడి నుంచి పాలేరుకు వెళ్తారు. పాలేరులో నిర్వహించే బహిరంగ సభలో తన భవిష్యత్ కార్యక్రమాన్ని షర్మిల ప్రకటించనున్నారు.