సినిమా పూర్తయిన వెంటనే చిన్న బ్రేక్ తీసుకోవడం చిరంజీవికి అలవాటు. ఈసారి కూడా మెగాస్టార్ అదే పని చేశారు. భార్య సురేఖతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
భార్యతో కలిసి అమెరికా వెళ్లారు చిరంజీవి. ఈ మేరకు ఆయన విమానంలోని బిజినెస్ క్లాస్ లో భార్యతో కలిసి దిగిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు. కొంచెం రిఫ్రెష్ అయి, మరింత ఉత్సాహాన్ని తెచ్చుకునేందుకు అమెరికా వెళ్తున్నానని ఆయన ప్రకటించారు.
భోళాశంకర్ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తిచేశారు చిరు. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ కూడా పూర్తిచేశారు. ఇలా అన్ని పనులు పూర్తయ్యాయని నిర్థారించుకున్న తర్వాతే ఆయన యూఎస్ పర్యటన చేపట్టారు.
చిరంజీవి అమెరికా వెళ్తున్నారనే వార్త బయటకు వచ్చిన వెంటనే ఆయన తానా మహాసభలకు హాజరవుతారనే పుకారు చెలరేగింది. దీనిపై చిరు పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. తను కేవలం రీఫ్రెష్ అవ్వడానికి మాత్రమే యూఎస్ వెళ్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
తిరిగొచ్చిన తర్వాత కూతురు సుశ్మిత నిర్మాతగా, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కొత్త సినిమా స్టార్ట్ చేస్తారు చిరంజీవి. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ప్రకటించారు చిరు. యూఎస్ టూర్ పూర్తయిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేస్తానని వెల్లడించారు. ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటించనుంది.
ఇక భోళాశంకర్ విషయానికొస్తే.. ఈ సినిమా లిరికల్ సాంగ్స్ ను దశలవారీగా విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి సెలబ్రేషన్ సాంగ్ ను విడుదల చేస్తారు. టీజర్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది.