ఈ నెలాఖరు నుంచి ఏకంగా నెల రోజుల పాటు మెగాభిమానులు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే, మనిమం గ్యాప్స్ లో మెగాహీరోలు థియేటర్లలోకి వస్తున్నారు. తమ కొత్త సినిమాలతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ను అలరించబోతున్నారు.
జులై 28.. పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తేదీ. ఆ రోజు బ్రో రిలీజ్ అవుతోంది. పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఇది. అంటే ఇద్దరు మెగా హీరోలు ఒకేసారి థియేటర్లలోకి వస్తున్నట్టన్నమాట. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఇక బ్రో రిలీజైన 2 వారాల గ్యాప్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమా వస్తోంది. తమిళ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ డైరక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 11న థియేటర్లలోకి వస్తోంది. తమన్న హీరోయిన్ గా నటించగా, చిరంజీవలి చెల్లెలిగా కీర్తిసురేష్ కనిపించనుంది. సుశాంత్ కూడా ఉన్నాడు. వాల్తేరు వీరయ్య లాంటి సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో, భోళాశంకర్ పై అంచనాలున్నాయి.
భోళా వచ్చిన వారం రోజులకే ఆదికేశవ వస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఇది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ రెడ్డి డైరక్ట్ చేస్తున్న ఈ మూవీలో వైష్ణవ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కంప్లీట్ యాక్షన్ మూవీ. ఆగస్ట్ 18న థియేటర్లలోకి వస్తోన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ఆదికేశవ్ వచ్చిన వారం రోజులకే మరో మెగా హీరో సినిమా రాబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవధారి అర్జున సినిమాను ఆగస్ట్ 25కు రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు. ఇది కూడా కంప్లీట్ యాక్షన్ మూవీ.
ఇలా జులై నెలాఖరు నుంచి ఆగస్ట్ చివరి వారం వరకు.. నెల రోజుల గ్యాప్ లో.. ఐదుగురు మెగా హీరోలు నటించిన 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మినిమం గ్యాప్స్ లో సందడి చేయబోతున్నాయి.