టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. మొన్నటివరకు ఈగల్ సినిమా షూట్ లో ఉన్న రవితేజ, ఇప్పుడు టైగర్ సెట్స్ పైకి వచ్చాడు.
టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్టు, రవితేజకు చాలా స్పెషల్. ఎందుకంటే, ఈ హీరో కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. అంతేకాదు, రవితేజ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమా ఇది. కేవలం సెట్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రవితేజ చేస్తున్న ఫుల్ లెంగ్త్ బయోపిక్ కూడా ఇదే.
దేశాన్ని గడగడలాడించిన ఓ దొంగ కథ ఇది. అయితే అతడి జీవితంలో కూడా ఓ నిజం ఉందంటున్నాడు దర్శకుడు వంశీ. టైగర్ నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అతడ్ని చూడ్డానికి 3 లక్షల మంది తరలివచ్చారని, అతడిలో ఏదో లేకపోతే అంతమంది రారని అంటున్నాడు.
తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి అక్టోబర్ 20 రిలీజ్ అనుకుంటున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.