గడిచిన 6 నెలలు టాలీవుడ్ కు మిశ్రమ ఫలితాల్ని, కొత్త అనుభూతుల్ని అందించాయి. ఇంకా చెప్పాలంటే, ప్రతి నెల విలక్షణంగా సాగింది. ఊహించని విజయాలతో పాటు, భయంకరమైన షాకుల్ని కూడా చూపించింది. నెలవారీగా టాలీవుడ్ పరిస్థితేంటో చూద్దాం..
జనవరి.. బాక్సాఫీస్ యోధులు
ఏటా ఉన్నట్టుగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి వార్ రంజుగా సాగింది. ఎన్నో దశాబ్దాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డాయి. సంక్రాంతి సీజన్ కావడంతో, సీనియర్లిద్దరి సినిమాలూ క్లిక్ అయ్యాయి. ఇదే నెలలో కల్యాణం కమనీయం, హంట్ లాంటి షాకులు కూడా తగిలాయి.
ఫిబ్రవరి.. మిడ్-రేంజ్ మెరుపులు
ఫిబ్రవరి నెలలో ఊహించని విధంగా 2 సినిమాలు క్లిక్ అయ్యాయి. వాటిలో ఒకటి ధనుష్ నటించిన సర్ సినిమా కాగా, ఇంకోటి సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్. ఈ రెండు సినిమాలకు రెండు ప్రత్యేకతలున్నాయి. తెలుగులో తొలి స్ట్రయిట్ విజయాన్ని ధనుష్ అందుకోగా.. సుహాస్ తొలి థియేట్రికల్ విజయాన్ని అందుకున్నాడు. ఇదే నెలలో వచ్చిన అమిగోస్, బుట్టబొమ్మ, వినరో భాగ్యము విష్ణుకథ లాంటి సినిమాలు నిరాశపరిచాయి.
మార్చి.. చిన్న సినిమా పెద్ద విజయం
మార్చి నెలలో చాలా సినిమాలొచ్చాయి. ఆ మాటకొస్తే స్టార్ హీరో నాని నటించిన దసరా మూవీ కూడా వచ్చింది. కానీ మార్చి నెలను బలగం మంత్ గా చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్ పై ఈ సినిమా చూపించిన ప్రభావం అలాంటిది. ఎలాంటి అంచనాల్లేకుండా, అతి చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ అతిపెద్ద విజయాన్ని నమోదుచేసింది. ఈ సినిమాకు ఇప్పటివరకు వందకుపైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఎన్నో దశాబ్దాల తర్వాత తెలంగాణ పల్లెల్లో పరదాలు కట్టి గ్రామాలకు గ్రామాలు ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించాయంటే.. ఈ సినిమా ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే నెలలో వచ్చిన దసరా కూడా తెలంగాణ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఏప్రిల్.. అతిపెద్ద సక్సెస్
ఇక ఏప్రిల్ నెలలో టాలీవుడ్ అతిపెద్ద సక్సెస్ చూసింది. సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ సాయితేజ్ ను వంద కోట్ల క్లబ్ లోకి చేర్చింది ఈ మూవీ. అంతేకాదు, యాక్సిడెంట్ తర్వాత రిలీజై, అతడి కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. ఇక ఈ నెలలో రిలీజైన శాకుంతలం, రావణాసుర, ఏజెంట్ సినిమాలు షాకిచ్చాయి.
మే.. ఫ్లాపుల పరంపర
మే నెలలో ఫ్లాపుల పరంపర సాగింది. రామబాణం, కస్టడీ, అన్నీ మంచి శకునములే, మళ్లీ పెళ్లి.. ఇలా వచ్చిన సినిమాలన్నీ వచ్చినట్టే ఫ్లాపులయ్యాయి. ఉన్నంతలో ఈనెలలో మేమ్ ఫేమస్ అనే సినిమా ఆకట్టుకుంది. ఓవైపు నెగెటివ్ టాక్ బీభత్సంగా నడిచినప్పటికీ, భారీ పబ్లిసిటీ కారణంగా లాభాలు ఆర్జించింది ఈ మూవీ.
జూన్.. అతిపెద్ద షాక్
ఇక జూన్ నెలలో ఇండస్ట్రీకి ఆదిపురుష్ రూపంలో అతిపెద్ద షాక్ తగిలింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటిగా రిలీజైన ఆదిపురుష్ సినిమా బయ్యర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. భారీ రేట్లకు అమ్మిన ఈ సినిమా, ఏ దశలోనూ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఈ సినిమాతో పాటు ఇదే నెలలో వచ్చిన అహింస, టక్కర్, నేను స్టూడెంట్ సర్, స్పై లాంటి చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఉన్నంతలో జూన్ నెలలో మెరిసిన సినిమా సామజవరగమన మాత్రమే.
ఇలా ఈ ఏడాది తొలి అర్థభాగంలో ప్రతి నెల విలక్షణంగా సాగింది. అంచనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వగా, సైలెంట్ గా వచ్చిన సినిమాలు హిట్టయ్యాయి.