తనపై తీవ్ర ఆరోపణలు చేసిన నారా లోకేశ్‌పై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నువ్వెంత, నీ బతుకెంత రా? అసలు చంద్రబాబుకు ఎట్లా పుట్టావురా? అంటూ విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే పసన్నకుమార్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నల్లతాచు పాము లాంటి వాడని, నాలుగేళ్లలో ఇసుక, మట్టి దోపిడీతో రూ.1500 కోట్లు దోచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోవూరు ఎమ్మెల్యే అవినీతిపై సిట్ వేసి తిన్నది మొత్తం కక్కిస్తామని, వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోకేశ్ తనపై చేసిన విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చారు.
పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై విమర్శలు చేయడం లోకేశ్‌కు అలవాటైందన్నారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు రాయించిన దాన్ని చదివి, తనను, జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టి వెళ్లాడన్నారు. రూ.1500 కోట్ల అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అడుగుతానన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు నిజమైతే తనను బుచ్చిరెడ్డిపాళెంలో ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
వెంకయ్యనాయుడు మంజూరు చేసిన అభివృద్ధి పనుల్ని కూడా లోకేశ్ తన తండ్రి ఖాతాలో వేసుకున్నాడని విమర్శించారు. లోకేశ్‌కు సరిగా తెలుగు రాదని విమర్శించారు. నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ రూ.1000 కోట్లు, తనపై రూ.1500 కోట్లు అవినీతికి పాల్పడినట్టు ఆరోపించారన్నారు. ఇవాళ కావలిలో ఎమ్మెల్యేపై రూ.2 వేల కోట్ల అవినీతి చేసినట్టు ఆరోపణలు చేస్తాడన్నారు. ఇలా పెంచుకుంటూ పోతాడని ఆయన వెటకరించారు. నీ పక్కనే వున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలను అడిగితే తన ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పేవారన్నారు.
రూ.1500 కోట్లు తన దగ్గర వుంటే నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీడీపీని నేలమట్టం చేసేవాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి రూపాయలున్నా పేదలకు ఖర్చు పెట్టడం తన నైజమన్నారు. నీ తాత రెండెకరాల భూమిని మీ తండ్రికి ఇచ్చాడని, ఇవాళ రూ.4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
తన ఇంటికి టీడీపీ నేతల్ని పంపిస్తే కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తుల వివరాలన్నీ ఇస్తానని, రూ.1500 కోట్లు సంపాదించినట్టు తేలితే మొత్తం పంచుతానని సవాల్ విసిరారు. నీ వయసెంత, నువ్వెంత? నా కాలి గోటికి సరిపోవంటూ లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ విదేశాల్లో అమ్మాయిలతో సరస సంబరాల్లో మునిగితేలిన ఫొటోలను ఆయన ప్రదర్శించారు.