పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీకి మరోసారి నిరాశే ఎదురైంది. దొంగలందరికీ మోదీ ఇంటిపేరే ఎందుకు వుంటుందో అని కర్నాటకలో గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షను సూరత్‌కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఆధారంగా రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.
దీంతో ఈ వ్యవహారం న్యాయ స్థానానికి చేరింది. సూరత్ సెషన్స్ కోర్టు విధించిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్‌గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా రాహుల్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ సందర్భంగా గుజరాత్ హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది.
“దేశ వ్యాప్తంగా రాహుల్ ఇప్పటికే 10 కేసులను ఎదుర్కొంటున్నారు. మోదీ ఇంటిపై ఆయన చేసిన కామెంట్స్‌కు సెషన్స్ కోర్టు విధించిన శిక్ష సరైందే, న్యాయమైందే. ఈ శిక్షను రద్దు చేసేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. రాహుల్ అభ్యర్థనను కొట్టి వేస్తున్నాం” అని గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌కు సుప్రీంకోర్టే ప్రత్యామ్నాయం కానుంది.
గుజరాత్ హైకోర్టులో సానుకూల తీర్పు రాకపోవడంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత అట్లే ఉండనుంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అయనకు అవకాశం వుండదు. రాహుల్ రాజకీయ భవిష్యత్ సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి వుంటుంది. ఇదిలా వుండగా తాజా తీర్పుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.