ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తెలంగాణలో ఈ ఘటన జరగడంతో తెలుగు సమాజం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో నాలుగు బొగీలు పూర్తిగా దగ్ధమైనట్టు సమాచారం. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురి కావడం గమనార్హం.
ఒడిశా గత నెలలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో దాదాపు 300 మందికి పైగా మృత్యువాత పడడం, అలాగే వందలాది మంది గాయాలపాలైన దుర్ఘటన దేశ ప్రజానీకాన్ని భయపెట్టింది. దీంతో రైలు ప్రమాదం అంటే పెనువిషాదం కళ్ల ముందు మెదిలే పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు.
ఈ సమాచారాన్ని వెంటనే లోకోఫైలట్కు అందించి రైలును నిలిపివేయించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య జరిగింది. ప్రయాణికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని కిందికి దిగారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఆరు బోగీలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్నాయి.
బోగీల మధ్య లింక్‌ను తప్పించే ప్రయత్నాలు కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేరుకున్నారు. మొదట ప్రయాణికుల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటన పగలు జరగడంతో ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు. ఒకవేళ రాత్రివేళ జరిగి వుంటే సజీవ దహనమయ్యేవారని భయంతో ప్రయాణికులు చెబుతున్నారు. కాలిపోయిన బోగీల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర ప్రయాణికులు ఉన్నారని సమాచారం.