చిత్రం: రంగబలి
రేటింగ్: 2/5
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, గోపరాజు రమణ, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కెమెరా: వంశీ పచ్చిపులుసు, దివాకర్ మణి
మ్యూజిక్: పవన్ సీహెచ్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
విడుదల తేదీ: జులై 7, 2023
ప్రమోషన్స్ తో పిచ్చెక్కించింది రంగబలి. టీజర్/ట్రయిలర్ హిట్టవ్వడంతో పాటు, కొంతమంది మీడియా ప్రముఖుల్ని అనుకరిస్తూ కమెడియన్ సత్యతో చేయించిన స్పూఫ్ ఇంటర్వ్యూలు సూపర్ గా క్లిక్ అవ్వడంతో సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ప్రమోషన్స్ లో చెప్పినంతగా, సినిమాలో మేటర్ ఉందా?
సినిమాలో హీరో పేరు శౌర్య అలియాస్ 'షో' (నాగశౌర్య). ఏం చేసినా నలుగురి దృష్టి ఇతడిపై పడాల్సిందే. అందుకే అందరూ ఇతడ్ని షో అని పిలుస్తుంటారు. రాజవరం అనే ఊరు, అందులో రంగబలి సెంటర్. ఇదే షో అడ్డా. ఊరే తనకు సర్వస్వం, తన భవిష్యత్తు అని ఫీల్ అవుతుంటాడు. తండ్రి మెడికల్ షాపులో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఫ్రెండ్స్ తో మందుకొడుతూ జాలీగా గడిపేస్తుంటాడు. కొడుకును ప్రయోజకుడ్ని చేసేందుకు తండ్రి అతడ్ని వైజాగ్ పంపిస్తాడు.
అక్కడ సహజ (యుక్తి తరేజా)కు కనెక్ట్ అవుతాడు షో. పెళ్లికి అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో తన ప్రేమకు రంగబలి సెంటర్ కు కనెక్షన్ ఉందని తెలుసుకుంటాడు. తిరిగి రంగబలి సెంటర్ కు వచ్చి లోకల్ ఎమ్మెల్యే (షైన్ టామ్ చాకో)తో గొడవ పెట్టుకుంటాడు. ఈ గొడవలకు, రంగబలి సెంటర్ కు, షో ప్రేమకు లింక్ ఏంటనేది స్టోరీ.
కథలో పాయింట్ కొత్తగా ఉంది. హీరో ఎస్టాబ్లిష్ మెంట్, రాసుకున్న సన్నివేశాలు అన్నీ బాగున్నాయి. మరీ ముఖ్యంగా కామెడీ బాగా క్లిక్ అయింది. కానీ కీలకమైన సెకెండాఫ్, అందులో ఎమోషన్ దగ్గరకు వచ్చేసరికి దర్శకుడు పవన్ చేతులెత్తేశాడు. ఫస్టాఫ్ ను డీటెయిల్డ్ గా, సరదా సీన్స్ తో రాసుకున్న దర్శకుడు.. సెకెండాఫ్ కు వచ్చేసరికి ఎవరో వెనక నుంచి తరుముతున్నట్టు హడావుడిగా చుట్టేశాడు.
'కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పలేడు' అనే డైలాగ్ ఉంది సినిమాలో. నిజంగానే అంతే క్లారిటీతో ఫస్టాఫ్ ను హ్యాండిల్ చేశాడు దర్శకుడు. కానీ సెకెండాఫ్ కు వచ్చేసరికి ఆ క్లారిటీ అతడిలో మిస్సయింది. మరీ ముఖ్యంగా హీరో-విలన్ కాన్ ఫ్లిక్స్ దగ్గరకు వచ్చేసరికి బలమైన యాక్షన్-ఎమోషన్ ను చూపించాల్సింది పోయి, విలన్ ను తీసుకెళ్లి హాస్పిటల్ బెడ్ పై పడుకోబెట్టించడం, హీరో వెళ్లి జైళ్లో కూర్చోవడం, ఆ తర్వాత చాలా సింపుల్ గా, తనకు కన్వీనియంట్ గా అనిపించేలా క్లయిమాక్స్ ను చుట్టేయడం రంగబలి రిజల్ట్ ను గాడితప్పేలా చేశాయి.
కథనం విషయంలో ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు దర్శకుడు. 'ఇది నేనే' అంటూ చిన్న పిల్లాడి ఎపిసోడ్ నుంచి కథ మొదలుపెడతాడు. ఆ వెంటనే హీరో ఎలివేషన్లు, కామెడీ బాగా పెట్టాడు. హీరోయిన్ తో లవ్ ట్రాక్, మినిమం గ్యాప్స్ లో వచ్చే కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటివి బాగానే వర్కవుట్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి దర్శకుడు కథనంపై తన పట్టు కోల్పోయాడు. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ కు వచ్చేసరికి, ఒక వైపు రోలింగ్ టైటిల్స్ పడుతున్నప్పటికీ, ఇంకా ఏదో ఉందేమో అంటూ ప్రేక్షకుడు ఎదురుచూస్తూ సీట్లో కూర్చుంటాడు. సినిమాకు సరైన ముగింపు ఇవ్వలేదనే విషయం ఇక్కడే అర్థమైపోతుంది.
నాగశౌర్య ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా కనిపించాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ కు మారేందుకు ఈ సినిమాను అతడు బాగా ఉపయోగించుకున్నాడు. కుదిరినప్పుడల్లా కండలు చూపించాడు. అయితే రంగబలి సెంటర్ కు, తన జీవితానికి లింక్ ఉందని తెలుసుకున్న తర్వాత కాస్త పరిణతి చెందిన వ్యక్తిగా శౌర్యను చూపిస్తే బాగుండేది. ఆ ప్రయత్నం దర్శకుడూ చేయలేదు, శౌర్య కూడా చూపించలేదు.
నాగశౌర్య తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి కమెడియన్ సత్య. ఈ సినిమాకు సేవియర్ ఇతడే. స్పూఫ్ ఇంటర్వ్యూలతో అతడు ఈ సినిమాకు ఎంత హైప్ తీసుకొచ్చాడో, సినిమాలో చేసిన కామెడీతో ఈ మూవీని ఆదుకునే బాధ్యత కూడా ఇప్పుడు ఇతడిపైనే పడినట్టు కనిపిస్తోంది. హీరోయిన్ యుక్తి తరేజా తన లుక్స్ తో ఆకట్టుకుంది. సన్నివేశాల్లో సంప్రదాయబద్ధంగా కనిపించిన హీరోయిన్, సాంగ్స్ వచ్చేసరికి రెచ్చిపోయింది.
విలన్ గా నటించిన టామ్ చాకో తన పాత్రకు న్యాయం చేశాడు. ఇంతకుముందు అతడు చేసిన దసరా సినిమా రేంజ్ లో మాత్రం రంగబలిలో అతడి పాత్ర లేదు. సినిమా సెకండాఫ్ లో టామ్ పాత్రను బలంగా రాసుకోలేకపోయాడు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో శరత్ కుమార్ మెప్పించగా.. గోపరాజు రమణ, మురళీ శర్మ, సప్తగిరి, భద్రం, రాజ్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సాంగ్స్ ఏవీ క్యాచీగా లేవు. ఐటెంసాంగ్ అయితే మరీ పురాతన కాలం నాటి ఐటెంసాంగ్స్ ను తలపించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు పవన్ బాసంసెట్టి కాస్త ఫ్రెష్ గా ఉండే లైన్ రాసుకున్నాడు కానీ దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, కథను నడిపించిన తీరు సరిగ్గా లేదు. అతడి రైటింగ్ లో లోపాలు సెకండాఫ్ లో స్పష్టంగా కనిపిస్తాయి.
ఓవరాల్ గా రంగబలి సినిమాలో అదిరిపోయే రేంజ్ లోనైతే ఎంటర్ టైన్ మెంట్ లేదు. పైపెచ్చు అక్కడక్కడ అసభ్యత కూడా ధ్వనిస్తుంది. సత్య వల్ల సినిమా కొన్ని పార్టుల్లో నవ్విస్తుంది. ఎమోషన్ కూడా పండినట్టయితే ఈ రంగబలి నెక్ట్స్ లెవెల్ లో ఉండేది. ఆ ఛాన్స్ మిస్సయింది.
బాటమ్ లైన్: ప్రమోషన్ ఎక్కువ.. ఎమోషన్ తక్కువ