విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ ముందు ఇలాంటి సినిమానా!

విజ‌య్ కూడా ఒక‌టీ రెండు సంవ‌త్స‌రాలు విరామంతో.. ఈ లోపు త‌న పార్టీ ప్ర‌య‌త్నాల‌ను ఒక కొలిక్కి తీసుకురావొచ్చు

ఇప్ప‌టికే పార్టీ పేరును కూడా ప్ర‌క‌టించాడు త‌మిళ స్టార్ హీరో విజ‌య్. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మిళ‌నాట చాలా మంది న‌టీన‌టులు పార్టీల‌ను స్థాపించారు. ఆది నుంచి త‌మిళ‌నాడు రాజ‌కీయానికి, నాట‌క‌-సినీ రంగానికి అభినాభావ సంబంధం ఉంది. పార్టీ పెట్టి అధికారాన్ని సంపాదించి, ఆ త‌ర్వాత త‌ను మ‌ర‌ణించేంత వ‌ర‌కూ అధికారాన్ని అట్టి పెట్టుకున్నాడు ఎంజీఆర్. అంత‌కు ముందు అన్నాదురైకి కూడా త‌మిళ‌నాడు నాట‌క‌-సినిమా రంగంలో సంబంధం ఉంది.

డీఎంకే ద్వారా ముఖ్య‌మంత్రి అయిన క‌రుణానిధి కూడా సినిమా ర‌చ‌యితే! ద‌క్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జ‌య‌ల‌లిత కూడా త‌మిళ‌నాడు సీఎంగా సుదీర్ఘ ప్ర‌స్థానాన్ని కలిగి ఉన్నారు. వీరి స్ఫూర్తితో అనేక మంది సినిమా వాళ్లు త‌మిళ‌నాట రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు, సొంత పార్టీలు కూడా పెట్టారు. శివాజీ గ‌ణేష‌న్ కూడా ఒక ద‌శ‌లో ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ త‌ర్వాత యాక్టివ్ గా పార్టీ పెట్టి పోరాడింది విజ‌య్ కాంత్.

విజ‌య్ కాంత్ రెండు, మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీని గ‌ట్టిగా పోటీలో నిలిపాడు. తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన్న‌ప్పుడు త‌న పార్టీ త‌ర‌ఫున త‌ను మాత్ర‌మే విజ‌యం సాధించాడు ఆ స్టార్ హీరో. రెండోసారి ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత పార్టీతో పొత్తుతో వెళ్లి అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీగా త‌న పార్టీని నిలిపాడు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. అయితే.. ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో విజ‌య్ కాంత్ సోలోగా వెళ్లి రాజ‌కీయంగా ఉనికిని కోల్పోయాడు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న రాజ‌కీయం కూడా ఉనికి కోల్పోయింది. ఇప్పుడు విజ‌య్ కాంత్ పార్టీ ఉన్నా లేని స్థితిలో కొన‌సాగుతూ ఉంది.

ఇంకా త‌మిళ‌నాట మ‌రో హీరో కార్తీక్ కూడా ఒక పార్టీని న‌డిపించాడు కొంత‌కాలం. అలాగే శ‌ర‌త్ కుమార్ ఒక పార్టీని న‌డిపించాడు. సినిమా గుర్తింపుతో ఇంకా అనేక చోటామోటా పార్టీలు త‌మిళ‌నాట ఉన్నాయి. క‌మ‌ల్ హాస‌న్ ఒక పార్టీని పెట్టిన‌డిపించ‌లేక చేతులెత్తేసి సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. ర‌జ‌నీకాంత్ పార్టీ అదిగో.. ఇదిగో.. అనే ముచ్చ‌ట్ల‌తో ద‌శాబ్దాల పాటు వార్త‌ల్లో ఉండి, ఆ త‌ర్వాత తెర‌మ‌రుగు అయ్యింది. మ‌రి ఇన్ని అనుభ‌వాల నేప‌థ్యంలో సినిమాల్లో త‌న స్టార్ డ‌మ్ ను పొలిటిక‌ల్ పార్టీ ఏర్పాటుకు విజ‌య్ వాడుకుంటూ ఉన్నాడు.

ఇప్ప‌టికే పార్టీ పేరును ప్ర‌క‌టించారు, బ‌హుశా త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పూర్తి స్థాయిలో బ‌రిలోకి దిగుతున్నాడ‌ని స్ప‌ష్టం అవుతోంది. విజ‌య్ కు సంబంధించిన మ‌రో విశేషం.. రాజ‌కీయాల్లో బిజీ అవుతున్న త‌రుణంలో ఇక ఇప్పుడ‌ప్పుడే సినిమాలు ఉండ‌వ‌నే క్లారిటీ ఇవ్వ‌డం. బ‌హుశా ఎన్నిక‌ల‌కు మందు గోట్ ఆయ‌న చివ‌రి సినిమా. అయితే ఇది త‌మిళ‌నాడు అవ‌త‌ల సంగ‌తెలా ఉన్నా, త‌మిళ‌నాట కూడా డివైడ్ టాక్ ను ఎదుర్కొంటూ ఉంది.

పొలిటిక‌ల్ ఎంట్రీ నేప‌థ్యంలో ఇది విజ‌య్ కు ఒక‌ర‌కంగా ప్ర‌తిష్టాత్మ‌కం. అయితే ఈ సినిమా క‌థాంశం, ట్రీట్ మెంట్ ప‌ట్ల స‌ర్వ‌త్రా పెద‌వి విరుపులు క‌నిపిస్తూ ఉన్నాయి. అయితే విజ‌య్ సినిమాలు ఎలా ఉన్నా.. క‌లెక్ష‌న్ల‌కు లోటు అయితే ఉండ‌దు.

లియో సినిమా కూడా ఒక హాలీవుడ్ సినిమాకు కాపీ, థియేట‌ర్లో చాలా సార్లు బోర్ కొట్టిస్తుంది కూడా, అయినా వంద‌ల కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయ‌ట‌! ఇప్పుడు విజ‌య్ కు చివ‌రి సినిమా అనే ప్ర‌చారం నేప‌థ్యంలో ఈ సినిమా ఎలా ఉన్నా వ‌సూళ్లు రాబ‌ట్ట‌వ‌చ్చు! అయితే.. వ‌సూళ్లు రాబ‌ట్టేస్తే స‌రిపోదు. ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందే ఏ హీరోకు అయినా నిజ‌మైన హిట్! ఈ ర‌కంగా చూస్తే విజ‌య్ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీకి సినిమా లాంఛింగ్ ఎఫెక్ట్ ను ఇచ్చుకోవ‌డంలో ఫెయిలయిన‌ట్టుగానే ఉన్నాడు!

మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ముందు ఒక మంచి సినిమాతో ఊపు తెచ్చుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు చేశార‌ప్ప‌ట్లో. దానికోసం చాలా చ‌ర్చ‌లే జ‌రిపినా శంక‌ర్ దాదా జిందాబాద్ ప్ర‌జారాజ్యం పార్టీ ముందు చివ‌రి సినిమాఅయ్యింది. ఆ సినిమా ఆడ‌లేదు అప్ప‌టికే! దాని త‌ర్వాత పార్టీ ప్రారంభం ముందు ఒక సోష‌ల్ సినిమాతో ఊపు తేవాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. దానికోసం త‌మిళ శంక‌ర్ నుంచి, తెలుగు శంక‌ర్ వ‌ర‌కూ చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. అయితే చివ‌ర‌కు సినిమా తీయ‌కుండానే చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ వైపు వెళ్లడం, ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌కు పార్టీని విలీనం చేసి సినిమాలు చేసుకుంటూ ఉండ‌టం జ‌రుగుతూ ఉంది.

క‌మ‌ల్ హాస‌న్ కూడా పొలిటిక‌ల్ పార్టీ ప్రారంభం స‌మ‌యంలో.. సినిమాల‌కు సెల‌వు అనే ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టున్నారు. అయితే ఇప్పుడు రాజ‌కీయాల‌కు సెల‌విచ్చి క‌మ‌ల్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

సినిమా న‌టుల ప్ర‌క‌ట‌న‌ల‌కు పెద్ద విలువ ఏమీ లేదు. తాము సినిమాల‌కు సెల‌వు ఇచ్చి ప్ర‌జాసేవ‌కే ఇక జీవితాల‌ను త్యాగం చేయ‌బోతున్న‌ట్టుగా వారు రాజ‌కీయ పార్టీల ప్రారంభపు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో వ‌ర్క‌వుట్ కాక‌పోతే తిరిగి సినిమాలు చేయ‌డ‌మే త‌మ‌కు జీవ‌నాధారం అంటూ ప‌ల‌క‌డం వీరికి ఈజీనే. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇలాంటి మాట‌లెన్నో చెప్పాడు. ఇప్ప‌టికీ ఆయ‌న చేతిలో పెండింగ్ సినిమాలున్నాయి.

విజ‌య్ కూడా ఒక‌టీ రెండు సంవ‌త్స‌రాలు విరామంతో.. ఈ లోపు త‌న పార్టీ ప్ర‌య‌త్నాల‌ను ఒక కొలిక్కి తీసుకురావొచ్చు! త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం అయితే ఉంది. అంత వ‌ర‌కూ రాజ‌కీయాల‌తో బిజీ, ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో అనుకున్న‌ది ద‌క్క‌క‌పోతే.. మ‌ళ్లీ సినిమాలు గుర్తుకూ రావొచ్చు! ఎంత‌మంది స్టార్ల‌ను చూడ‌లేదు జ‌నాలు!

11 Replies to “విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ ముందు ఇలాంటి సినిమానా!”

    1. చూసే జనాలు ఉన్నారు. You tube lo ఫ్రీ గా దొరికే సినిమా నే … రీ రిలీజ్ అని థియేటర్ కి వెళ్లి చూసే జనాలు ఉన్నారు. ఆ వెర్రి అభిమానమే సినిమా జనాలకి పెట్టుబడి.

  1. అందరికీ బి ..నా..మీ వ్యాపారాలు… తాత తండ్రుల ద్వారా వచ్చిన ఆస్తులు ఉండవు కదా GA గారూ… వారికి సినిమానే నాలుగు డబ్బులు వెనుకేసుకునే ఆదాయ వనరు. ఇటు రాజకీయంగా బిజీ గా లేకపోతే … వెళ్లి సినిమాలు చేసుకుంటే తప్పేముంది. అయినా అది ఇల్లీగల్ ఏమీ కాదు కదా… మనం కూడా ఈ పని క్లిక్ అయితే ఆ పని మానేస్తాను అనుకుంటాం… అది క్లిక్ అవ్వకపోతే కొనసాగిస్తాం… సినిమా స్టార్లు కూడా అంతే… What’s wrong in that?

    1. అంతగా డబ్బులు లేకుండా రాజకీయాల్లోకి రమ్మని ఎవరు బ్రతిమాలేరు సార్? రాజకీయాల్లో రాణించకపోతే తిరిగి సినిమాలు చేసుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు, కానీ ఆ ముక్క ముందు చెప్పాలి. సమర్ధన కోసం బి… నా… మీ అని అర్ధం లేని మాటలు మాట్లాడకండి. రాజకీయాల్లోకి రావటం తప్పు కాదు, శిఖండి రాజకీయాలు తప్పు. ప్రజలకి మంచి చేయడం కోసం వస్తే పర్లేదు, అంతే కానీ ప్యాకేజీల కోసం, లేకపోతే ఒకళ్ళని ద్వేషిస్తూ వాళ్ళని మాత్రం గెలవకూడదు అని రాజకీయాల్లోకి రావటమే తప్పు 🙏

  2. అతనికి అంత సీన్ లేదు.

    ఏదొ మిషనరీస్ ప్రోదల్బంతో పార్టీ ని పెడుతున్నాడు.

    మెజారిటీ వర్గాలు ఆదరించవు.

    జనాల్లో తిరిగే ఓపిక, స్టామినా అతనికి లేదు.

    సుకుమారంగా పెరిగిన జీవించిన వాడు.

    మోటు రాజకీయాలలో రాణించలేడు.

    డీ ఎం కే పార్టీ అతన్ని టార్గెట్ చేస్తోంది.

  3. నిర్మాత: వాటికన్ చర్చ్

    నటుడు: విజయ్

    సినిమా: రాజకీయ పార్టీ

    స్లోగన్: తమిళ నాడు నీ యేసు రాజ్యం గా మార్చడం.

Comments are closed.