టీటీడీ ఆయుర్వేద వైద్యంపై ప్రై‘వేటు’

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఆయుర్వేద ఆస్ప‌త్రి వైద్యుల ప్రైవేట్ వైద్యంపై పాల‌క మండ‌లి వేటు వేసింది. దీంతో టీటీడీ ఆయుర్వేద ఆస్ప‌త్రిలోని కొంద‌రు వైద్యులు గిల‌గిల‌లాడుతున్నారు. టీటీడీ ఆయుర్వేద వైద్య‌శాల‌ను ఒక…

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఆయుర్వేద ఆస్ప‌త్రి వైద్యుల ప్రైవేట్ వైద్యంపై పాల‌క మండ‌లి వేటు వేసింది. దీంతో టీటీడీ ఆయుర్వేద ఆస్ప‌త్రిలోని కొంద‌రు వైద్యులు గిల‌గిల‌లాడుతున్నారు. టీటీడీ ఆయుర్వేద వైద్య‌శాల‌ను ఒక వ్య‌వ‌స్థ‌గా బ‌లోపేతం చేసే క్ర‌మంలో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి, జేఈఓ స‌దా భార్గ‌వి క‌లిసి సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీటీడీ ఆధ్వ‌ర్యంలో స్విమ్స్‌, బ‌ర్డ్‌, అశ్వినీ, సెంట్ర‌ల్ , ప‌ద్మావ‌తి, ఆయుర్వేద ఆస్ప‌త్రులు న‌డుస్తున్నాయి. పేద‌ల‌కు ఉచితంగా, అలాగే నామ‌మాత్ర ఫీజుల‌తో మెరుగైన వైద్యం అందిస్తున్నాయి. వీటిన్నింటిని టీటీడీకి సంబంధించి వెల‌క‌ట్ట‌లేని ఆస్తులుగా భావిస్తూ, వాటిని బ‌లోపేతం చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వాటిలో ప‌ని చేసే వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై టీటీడీ నిషేధం విధించింది.

టీటీడీ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయ‌కుండా ఉండేందుకు వారికి నాన్ ప్రాక్టీస్ అలివెన్స్‌ల‌ను టీటీడీ అంద‌జేస్తోంది. కేడ‌ర్‌ను బ‌ట్టి వారికి అలవెన్స్ సొమ్మును ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే టీటీడీ ఆయుర్వేద వైద్యులు పాల‌క మండ‌లి నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ  కింది కోర్టు మొద‌లుకుని, సుప్రీంకోర్టు వ‌ర‌కూ న్యాయ‌పోరాటం చేశారు. అయితే వారికి సానుకూల తీర్పు రాలేదు. ఈ నేప‌థ్యంలో టీటీడీ పాల‌క‌మండ‌లిని మెప్పించి తిరిగి ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అనుమ‌తి సాధించుకున్నారు.

దీంతో వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే రోగుల‌కు త‌మ ద‌ళారుల ద్వారా మాయ మాట‌లు చెప్పి, ప్రైవేట్ వైద్య‌శాల‌ల‌కు త‌ర‌లిస్తూ కొంద‌రు ఆయుర్వేద వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. సాక్ష్యాత్తు క‌లియుగ దైవం శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నెల‌కొల్పిన ఆయుర్వేద ఆస్ప‌త్రిగా భావించి, దీర్ఘ‌కాలిక , ఇత‌ర‌త్రా రోగాల‌తో బాధ‌ప‌డుతున్న రోగులు పెద్ద సంఖ్య‌లో తిరుప‌తికి వెళుతున్న ప‌రిస్థితి.

భార‌తీయ వైద్యాన్ని ప్రోత్స‌హించే స‌దాశ‌యంతో టీటీడీ, కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక శ‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి టీటీడీ ఆయుర్వేద ఆస్ప‌త్రిని ఏకంగా 250 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిగా తీర్చిదిద్దారు. ప్ర‌తిరోజూ ఓపీ సంఖ్య 400కు పైమాటే. అయితే ఆయుర్వేద వైద్యానికి డిమాండ్‌, రోగుల భ‌యాన్ని సొమ్ము చేసుకునేందుకు ఈ ఆస్ప‌త్రిలోని కొంద‌రు సీనియ‌ర్ వైద్యులు ప్రైవేట్ వైద్యానికి తెర‌లేపారు. ఇక్క‌డికి వ‌చ్చే రోగుల‌ను త‌మ ఆస్ప‌త్రికి త‌ర‌లించే ద‌ళారీ నెట్‌వ‌ర్క్‌ను ఏర్ప‌ర‌చుకుని పెద్ద ఎత్తున సొంత ఆస్తుల్ని పెంచుకుంటున్నారు.

మ‌రోవైపు తిరుప‌తి ఆయుర్వేద ఆస్ప‌త్రిని ఒక వ్య‌వ‌స్థ‌గా బ‌ల‌హీన‌ప‌రుస్తూ, కేవ‌లం వ్య‌క్తిగ‌త ప‌ర‌ప‌తిని పెంచుకునేందుకు కొంద‌రు వైద్యులు ప్ర‌య‌త్నిస్తుండ‌డంపై యాజ‌మాన్యానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేప‌థ్యంలో గ‌త నెల 19న ఆయుర్వేద వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై టీటీడీ ఆయుర్వేద వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయ‌వ‌ద్ద‌ని నిషేధం విధిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఈ నెల నుంచి అమ‌ల్లోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. 

విధాన ప‌ర‌మైన నిర్ణ‌యం వెనుక టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జేఈవో స‌దా భార్గ‌వి సత్సంక‌ల్పం వుంద‌ని చెబుతున్నారు. మంచి నిర్ణ‌యం తీసుకున్నందుకు వారంతా అభినంద‌న‌లు అందుకుంటున్నారు. టీటీడీ ఆయుర్వేద ఆస్ప‌త్రిలోని న‌లుగురైదుగురు సీనియ‌ర్ వైద్యులు మిన‌హాయించి, మిగిలిన వారంతా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.