ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? నిర్ధారించుకోలేని పరిస్థితి. ప్రస్తుతం మంగళగిరి పరిధిలో బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులపై రాజకీయ రాద్ధాంతం సాగుతోంది.
బాప్టిజం ఘాట్ నిర్మాణాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ రాజకీయ పునాదులు ఏ సిద్ధాంతంపై ఆధారపడి వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాబట్టి ఆ పార్టీ మతం పేరుతోనే కాసిన్ని ఓట్లను రాల్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరి పరిధిలో బాప్టిజం ఘాట్ నిర్మాణ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై బుధవారం ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో తాత్కాలికంగా మతం రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. హైకోర్టు స్టే ఇచ్చినా బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెనాలి రోడ్డులోని డొంకభూమిలో క్రైస్తవుల కోసం చేపట్టిన ఘాట్ నిర్మాణ పనుల వద్దకు బీజేపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి నిర్మాణ పనులు చేపట్టడంపై నిరసనకు దిగారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికెళ్లి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు స్టే ఆర్డర్ ఇంకా తమ చేతికి రాలేదని, వస్తే పనులు నిలుపుదల చేయిస్తామని అధికారులు చెబుతున్నారు.