ఎప్పట్లానే ఈ వారాంతం కూడా అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా 2 సినిమాలు మాత్రం ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వాటిలో ఒకటి నాగశౌర్య నటించిన రంగబలి కాగా, రెండోది భాగ్ సాలే అనే చిన్న సినిమా.
నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి సినిమాకు టీజర్ నుంచే ఊపొచ్చింది. ట్రయిలర్ తో అది కంటిన్యూ అయింది. ఆ తర్వాత కమెడియన్ సత్యతో చేయించిన స్పూఫ్ ఇంటర్వ్యూలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మధ్యలో లిరికల్ వీడియోస్ రిలీజ్ అవుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉన్నంతలో ఇంటర్వ్యూల్లో తన బోల్డ్ స్టేట్ మెంట్స్ తో శౌర్య కాస్త ఎట్రాక్ట్ చేయగలిగాడు.
ఇలా ఓ మోస్తరు అంచనాలతో వస్తోంది రంగబలి సినిమా. ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకుడిగా, యుక్తి తరేజా హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఊహించని విధంగా హైప్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఇవాళ్టి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ కూడా పెట్టారు. సో.. రాత్రికే మూవీ రిజల్ట్ ఏంటనేది తేలిపోతుంది.
ఇక రంగబలికి పోటీగా వస్తున్న సినిమా భాగ్ సాలే. ఈ సినిమాను కూడా మొన్నటివరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎందుకంటే శ్రీసింహా ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఎప్పుడైతే టీజర్ సూపర్ సక్సెస్ అయిందో అప్పట్నుంచి భాగ్ సాలేపై చర్చ మొదలైంది. డీజే టిల్లూ టైపులో ఈ సినిమా కూడా ఏదో మేజిక్ చేసేలా ఉందనే అంచనాలు తెచ్చుకుంది. ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ సినిమాను డైరక్ట్ చేశాడు.
ఈ సినిమాలతో పాటు.. సర్కిల్, ఓ సాథియా, రుద్రంగి, 7:11PM అనే సినిమాలు కూడా రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇప్పటికే థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సామజవరగమన సినిమాను వీటిలో ఏ మూవీ అడ్డుకుంటుందో చూడాలి.