మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి ఆర్కే రోజా చెలరేగిపోయారు. బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ తనదైన స్టైల్‌లో ఓ ఆట ఆడుకున్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా వుండి, నష్టాలొస్తున్నాయని విజయా డెయిరీ విషయంలో కుంటిసాకులు చూపి మూసి వేయించారన్నారు. జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే మంచి ప్రాజెక్టును చంద్రబాబు తీసుకురాలేదన్నారు.
ఇదే జగన్ వచ్చిన తర్వాత జిల్లాల విభజన జరిగిందని, అలాగే నగరికి రెవెన్యూ డివిజన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కుప్పంలో సంక్షేమ పథకాలతో పాటు ఆ పట్టణాన్ని మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్‌గా చేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. విజయా డెయిరీని ప్రారంభించిన జగన్ కమిట్‌మెంట్‌ను గుర్తించాలన్నారు. దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. విజయ డెయిరీని చంద్రబాబు మూసేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెరిచి మేలు చేశారని ప్రశంసించారు.
జగనన్న సురక్ష పథకం ప్రజల పాలిట శ్రీరామ రక్ష అని రోజా అభివర్ణించారు. సీఎం జగన్ ఒక విజనరీ ఉన్న ముఖ్యమంత్రి అన్నారు. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు తాను విజనరీ అంటూ విస్తరాకుల కట్ట కథ చెబుతాడని వ్యంగ్యంగా అన్నారు.
ఫోన్, కంప్యూటర్‌లతో పాటు హైదరాబాద్‌ను కూడా తానే కనిపెట్టానని చంద్రబాబు చెప్పుకుంటారని వెటకరించారు. తన కన్న కొడుకు లోకేశ్, దత్త పుత్రుడు పవన్‌ను ఎలా గెలిపించుకోవాలో చంద్రబాబు కనిపెట్టలేకపోయారని సెటైర్స్‌తో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్‌లను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. అందుకే ప్రజలు బైబై బాబు, గుడ్ బై పవన్‌కల్యాణ్ అంటున్నారని రోజా నినదించారు.