సినీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోల్ని ఇంటర్వ్యూలు చేయాలంటే సుమ కావాలి. ఆమె చేసే ఇంటర్వ్యూలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు సుమతో పెద్దగా అవసరం లేదు. ట్రెండ్ మారింది. ఓ హీరోను మరో ప్రముఖుడు ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్.
నిన్నటికినిన్న భాగ్ సాలే యూనిట్ ను బండ్ల గణేశ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ వ్యక్తి ఇలా యాంకర్ గా మారడం ఇదే తొలిసారి. సినిమా విశేషాలు అడుగుతూనే, తనదైన స్టయిల్ లో పంచ్ లు వేశాడు. వేదాంతం వల్లించాడు, కొటేషన్లు కూడా చెప్పాడు.
బండ్ల గణేశ్ కంటే ముందే చాలామంది ప్రముఖులు యాంకర్ల అవతారం ఎత్తారు. దర్శకుడు తేజ, హీరో గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ, అన్నీ మంచి శకునములే యూనిట్ ను ఇంటర్వ్యూ చేశాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ టైమ్ లో అనీల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ యాంకర్లుగా మారిపోయారు. ఇక గోపీచంద్ మలినేని, బాబి లాంటి దర్శకులు కూడా యాంకర్లుగా మారారు.
ఇక దర్శకుడు హరీశ్ శంకర్ కు ఈ విషయంలో మంచి ఫాలోయింగ్ ఉంది. రావణాసుర ప్రమోషన్స్ లో రవితేజను ఇంటర్వ్యూ చేశాడు. అంతకంటే ముందు, ఆచార్య యూనిట్ ను ఇంటర్వ్యూ చేశాడు.
ఈ లిస్ట్ లో ప్రభాస్ కూడా ఉన్నాడు. పూరి జగన్నాధ్ కొడుకును ప్రమోట్ చేసేందుకు ప్రభాస్ యాంకర్ గా మారాడు. సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. సహజంగానే సిగ్గు-మొహమాటం ఎక్కువ కావడంతో, యాంకర్ గా రాణించలేకపోయాడు.
ఈ ప్రచారంలో పరస్పర సహకారం కూడా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నాని-రవితేజ ఇంటర్య్యూను చెప్పుకోవచ్చు. రావణాసుర కోసం నాని యాంకర్ గా మారితే.. దసరా మూవీ కోసం రవితేజ యాంకర్ గా మారాడు. వీళ్లిద్దరూ కలిసి చేసిన ఇంటర్వ్యూ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇద్దరూ కలిసి కొన్ని రీల్స్ కూడా చేయడం విశేషం. రానున్న రోజుల్లో ఇంకెంతమంది ప్రముఖులు యాంకర్లుగా మారతారో.