ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపింది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సి వుంది. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా వుంది. దీంతో తమతో పాటు ఎన్నికలకు వచ్చేలా ఒప్పించేందుకు సీఎం జగన్‌ను ఢిల్లీకి పిలిపించుకుని ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా చర్చించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి ముందస్తు ఎన్నికలపై సంకేతాలు వెళ్లడంతో వైసీపీ ప్రజాప్రతినిధులు అప్రమత్తం అవుతున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలనే ఆలోచనలతో వైసీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్న తరుణంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ముందొచ్చినా, వెనకొచ్చినా తాము రెడీగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ దఫా గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించామని ఆయన గుర్తు చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్పడం గమనార్హం.
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా తాము మాత్రం ఒంటరిగానే బరిలో దిగుతామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తేల్చి చెప్పారు.