యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్… దారి పొడవునా వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు ఇచ్చిన సమాచారంలో నిజానిజాలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు లోకేశ్ నోరు పారేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తనదైన రీతిలో లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని అనిల్‌కుమార్ వెయ్యి కోట్ల ఆస్తుల్ని సంపాదించారంటూ, వాటి వివరాలతో సహా లోకేశ్ వెల్లడించారు. తాను అవినీతికి పాల్పడలేదని వెంకటేశ్వరస్వామి మీద అనిల్ ప్రమాణం చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. దీనికి అనిల్ ఘాటుగా స్పందించారు.
ఈ నేపథ్యంలో లోకేశ్‌కు అనిల్‌కుమార్ యాదవ్ దిమ్మతిరిగే సవాల్ విసిరారు. అనిల్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి ఇచ్చిన ఆస్తికంటే రూపాయి ఎక్కువున్నా వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణానికి సిద్ధమన్నారు. నెల్లూరు జిల్లా మినహా మరెక్కడా తనకు సెంటు భూమి కూడా లేదన్నారు. తన ఆస్తులపై నెల్లూరు నగరంలోని శ్రీవేంకటేశ్వరపురంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రమాణం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
లోకేశ్‌కు అతని తాత ఇచ్చిన రెండెకరాలతోనే ఆస్తులు సంపాదించామని దమ్ముంటే ప్రమాణం చేయాలని అనిల్ సవాల్ విసిరారు. నగరంలో తనకు 80 ఎకరాల భూమి వుందని లోకేశ్ ఆరోపించడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్కడ 13 ఎకరాలు మాత్రమే వుందని, అందులో కొంత విక్రయించినట్టు ఆయన చెప్పారు. తనకు రూ.50 కోట్ల ఇల్లు ఎక్కడుందో చెబితే, అక్కడికి వెళ్లి చేరుతానన్నారు. చెన్నైలో తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్టు అనిల్ తెలిపారు.
లోకేశ్‌తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించాలని మాజీ మంత్రి నారాయణ రూ.50 లక్షలు పంపగా, వాటిని వెనక్కి పంపినట్టు అనిల్ సంచలన విషయం చెప్పారు. ఈ విషయమై ఏ ఒక్కరూ మాట్లాడ్డం లేదన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారు టీడీపీలో చేరగానే పునీతులయ్యారా? అని అనిల్ ప్రశ్నించారు.