విదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి నిరాకరణకు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. ఏబీవీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం గమనార్హం. ఆర్జిత సెలవు (ఈఎల్)లపై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి ఏబీవీ దరఖాస్తు చేసుకున్నారు.
అయితే అనుమతి నిరాకరిస్తూ సీఎస్ ఏబీవీ దరఖాస్తును సీఎస్ తిరస్కరించారు. దీంతో ఏబీవీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పలు దఫాలుగా విచారించిన హైకోర్టు ఇవాళ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ఏబీవీకి అనుకూలంగా వున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావుకు అనుమతి నిరాకరిస్తూ సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేయడం విశేషం. ఏబీవీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.
గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రాజకీయ కార్యకలాపాలకు ఏబీవీ పాల్పడ్డారనే సీఎం వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నారు. తమ సెల్‌ఫోన్లను ట్యాప్ చేయడం, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించడంలో ఏబీవీ కీలక పాత్ర పోషించారని ఆ పార్టీ పెద్దల ఆరోపణ. టీడీపీ ప్రభుత్వం మారి, వైసీపీ పాలనా పగ్గాలు చేపట్టాక… ఏబీవీకి కష్టాలు మొదలయ్యాయి.
పలు ఆరోపణలపై ఆయన సస్పెండ్‌కు గురయ్యారు. న్యాయ పోరాటం చేసి ఒక దఫా యూనిఫాం వేసినా, అది మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. వైసీపీ ప్రభుత్వంపై సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా హాట్ కామెంట్స్ చేశారని ఏబీవీకి గతంలో నోటీసులు కూడా ఇచ్చారు. గతంలో ఏబీవీ చేసిన తప్పులు, గత కొన్ని నెలలుగా ఆయన్ను వెంటాడుతున్నాయి.
కనీసం విదేశాలకు వెళ్లడానికి కూడా అనుమతి దక్కని పరిస్థితి. హైకోర్టు తీర్పుతో వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా, లేక మరేదైనా చర్యకు దిగుతుందా? అనే చర్చకు తెరలేచింది.