బేబ‌క్క ఓవ‌రాక్ష‌నే కార‌ణ‌మా?

బిగ్‌బాస్ సీజ‌న్ 8 నుంచి బేబ‌క్క ఔట్. బెజ‌వాడ బేబ‌క్క‌గా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన బేబ‌క్క పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఆమె ఎంట్రీలోనే ఏదో ఓవ‌రాక్ష‌న్ వుంద‌ని తెలిసింది. ఆమె జోక్స్‌, సెటైర్లు,…

బిగ్‌బాస్ సీజ‌న్ 8 నుంచి బేబ‌క్క ఔట్. బెజ‌వాడ బేబ‌క్క‌గా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన బేబ‌క్క పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఆమె ఎంట్రీలోనే ఏదో ఓవ‌రాక్ష‌న్ వుంద‌ని తెలిసింది. ఆమె జోక్స్‌, సెటైర్లు, యాస యూట్యూబ్‌లో ఓకే కానీ, బిగ్‌బాస్‌లో వ‌ర్కౌట్ కాలేదు.

రీల్స్ చేయాలంటే ప్రిపేర్ అయ్యే టైమ్ వుంటుంది. వీడియో బాగా రాక‌పోతే మ‌ళ్లీ ప్ర‌య‌త్నించొచ్చు. కానీ బిగ్‌బాస్‌లో ఏదైనా సింగిల్ టేకే. విభిన్నమైన వ్య‌క్తుల‌తో ఒకే ఇంట్లో క‌లిసి వుండాలి. ఎవ‌రికి వాళ్లు తామే గొప్ప అనుకునే వ్య‌క్తుల మ‌ధ్య బేబ‌క్క ఇమ‌డ‌డం క‌ష్ట‌మైంది.

వ‌య‌సు ఎక్కువ ఉన్న వ్య‌క్తుల్ని బిగ్‌బాస్ ఎక్కువ వారాలు ఉంచ‌డు. ప్రేక్ష‌కుల ఓట్లు అనేది బ్ర‌హ్మ ర‌హ‌స్యం. బాస్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌. గ‌త సీజ‌న్లు చూసినా సీనియ‌ర్లు తొలి వారంలోనే ఔట్. శివాజీ సీనియ‌ర్ న‌టుడు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు కాబ‌ట్టి ఎలిమినేట్ కాకుండా గ‌తంలో ఉన్నాడు. ష‌కీలా, కిర‌ణ్‌ రాథోడ్‌, క‌రాటే క‌ల్యాణి, హేమ ఇలా ఎవ‌రి పేర్లు తీసుకున్నా ఫ‌స్ట్ వీక్ ఔట్ అయిన వాళ్లే.

బేబ‌క్క కూడా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వంట చేసే ప‌నిలో బిజీగా వుంది. వంట చేసినందుకే గొడ‌వ‌లు వ‌చ్చి నామినేష‌న్లు వేశారు. నిఖిల్‌ని విమ‌ర్శిస్తూ, ఇక మీద‌ట తాను త‌న‌లాగే వుంటాన‌ని బేబ‌క్క శ‌ప‌థం చేసింది కానీ కుద‌ర్లేదు. రీల్స్ చేసినంత ఈజీ కాదు, బిగ్‌బాస్‌.

ఈ సారి బిగ్‌బాస్ ఉత్సాహంగా లేడు. ఇంకా ముందు వైల్డ్ ఎంట్రీలో ఇంకెవ‌రైనా వ‌చ్చి ఆట ర‌క్తి క‌ట్టించాల్సిందే. నాగ‌మ‌ణికంఠ విషాద గీతాల‌కే ప‌రిమితం అయ్యాడు, వినోదం అత‌నికి తెలియ‌దు. పృథ్విలో ఫైర్ లేదు. నిమ్మ‌కి నీరెత్తిన‌ట్లున్నాడు. నిఖిల్ ఏదో షో చేస్తున్నాడు కానీ లాభం లేదు. ఓం బ‌ద్ద‌కంగా క‌దులుతున్నాడు. అభ‌య్ న‌వ్వించ‌డానికి కిందామీదా ప‌డుతున్నాడు.

అమ్మాయిలే కొంచెం బెట‌ర్‌. సోనియా , విష్ణుప్రియ సంవాదం కొంత ఆస‌క్తి. ఇచ్చిన టాస్క్‌లు ఆడ‌డం కాదు, మిగిలిన స‌మ‌యం ఏదో జ‌ర‌గాలి క‌దా? లైవ్ చూస్తే మ‌రీ ఘోరం. ఈసారి లోపం ఏమంటే కంటెస్టెంట్లు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌కపోవ‌డం. విభిన్న వ్య‌క్తులు కాకుండా, అంతా ఒకే గ్రూప్‌కి చెందిన వాళ్ల‌లా వుండ‌డం. శేఖ‌ర్‌బాషా రేడియో జాకీగా స‌రే కానీ, ఇక్క‌డ పేలడం లేదు. అంద‌రూ సెటిల్ కావ‌డానికి ఒక వారం ప‌ట్టింది. ఈ వారం ఆట ర‌క్తి క‌డుతుందేమో చూడాలి.

ఇక కిరాక్ సీత చిరాగ్గా వుంది త‌ప్ప‌, కిరాక్ ఏమీ లేదు. ఎపుడూ సీరియ‌స్‌గా వుంటే తొంద‌ర‌గా ఇంటికి పంపిస్తారు. యాష్మీ గౌడ‌, ప్రేర‌ణ‌లు కూడా బోర్‌గానే ఉన్నారు. ఉన్నంత‌లో నైనా బెట‌ర్‌. న‌బీల్ కామెడీ యూట్యూబ్‌కే ప‌రిమితం. బిగ్‌బాస్‌లో క‌న‌ప‌డ‌లేదు.

7 Replies to “బేబ‌క్క ఓవ‌రాక్ష‌నే కార‌ణ‌మా?”

Comments are closed.