తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇంట శుభకార్యం. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా దంపతుల రెండో కుమార్తె బృహతి, వెంకట్ అక్షయ్ వివాహం రామోజీ ఫిల్మ్‌సిటీలో గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రామోజీరావు తన పలుకుబడి ఏంటో చూపారు.
వివాహ వేడుకకు ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్‌కల్యాణ్ తదితర వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. తన మనవరాలి వివాహ ఉత్సవానికి రాజకీయ, వ్యాపార, న్యాయ, సినీ, మీడియా ప్రముఖులు ఎవరెవరు హాజరయ్యారో తన పత్రికలో వివరంగా రాసుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలెవరూ వేడుకకు హాజరు కాలేదు. అయితే ఎల్లో మీడియా ప్రముఖుడు ఈ వేడుకకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
రామోజీ మనవరాలి పెళ్లి వేడుకలో కనిపించని ఆ మీడియాధిపతే వేమూరి రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీగా కంటే చంద్రబాబు శ్రేయోభిలాషిగా , జగన్ ద్వేషిగా ఆర్కేని అందరూ గుర్తిస్తారు. రామోజీరావు మనవరాలి పెళ్లికి హాజరైన మీడియా ప్రముఖుల్లో సీవీఆర్ చానల్ అధినేత సీవీ రావు, స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్, మలయాళ మనోరమ నుంచి జాకబ్ మాథ్యూస్, రాజస్థాన్ పత్రిక నుంచి సిద్ధార్థ్ కొఠారి ఉన్నారు.
ఎల్లో మీడియాలో ఈనాడు తర్వాత స్థానం ఆంధ్రజ్యోతిదే. అలాంటి మీడియాధిపతి వేడుకకు హాజరు కాకపోవడం సహజంగానే చర్చనీయాంశమైంది. ఆంధ్రజ్యోతిలో రామోజీ మనవరాలి పెళ్లి వార్త కనిపించలేదు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే … రామోజీ, రాధాకృష్ణ మధ్య ఏదో గ్యాప్ ఉందన్న ప్రచారానికి తెరలేచింది. రాజకీయంగా, వ్యాపారపరంగా విభేదాలున్నా, శుభ, అశుభ కార్యాల్లో పాల్గొనడం ఒక సంప్రదాయం.
ఆర్కేని వివాహానికి పిలవకపోవడం వల్లే వెళ్లకపోయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లికి పిలవనంత విభేదాలు వాళ్ల మధ్య ఏముంటాయబ్బా అనే చర్చకు తెరలేచింది. ఈ ప్రచారంలో నిజానిజాలేంటో వాళ్లకే తెలియాలి.