ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. కనీసం సీఎం సొంత నియోజకవర్గంలో ఏ వర్గం నుంచి కూడా నిరసనలు లేకుండా చూసుకోవాల్సిన అధికారులు, ఆ పని చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 90 శాతం మంచి చేసి, 10 శాతం పెండింగ్‌లో పెట్టడం ఏంటో అధికారులకే తెలియాలి.
తాజాగా పులివెందులలో కడప మార్గంలో మెడికల్ కళాశాల నిర్మిస్తున్న స్థలానికి సంబంధించి పరిహారం విషయమై వివాదం తెరపైకి వచ్చింది. ఎకరాకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చారు. అయితే కేవలం 67 సెంట్లకు సంబంధించి పరిహారం విషయంలో వివాదం నెలకొనడం చర్చనీయాంశమైంది. సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ నిర్మించతల పెట్టారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రైతుల నుంచి ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది. ప్రస్తుతం అక్కడ వేగంగా పనులు జరుగుతున్నాయి.
ఇదే సందర్భంలో కె.వెలమవారిపల్లెకు చెందిన కె.మునిస్వామినాయుడు నుంచి 1.50 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 83 సెంట్ల భూమికి పరిహారం అందజేసింది. 67 సెంట్లకు రూ.31.55 లక్షల పరిహారం అందాల్సి వుంది. 19 నెలలుగా పరిహారం కోసం రైతు మునిస్వామినాయుడు కలెక్టర్, ఎంపీ, పాడా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు.
దీంతో ఆ రైతు విసిగిపోయారు. తన భూమిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ఎక్సకవేటర్‌తో తొలగించాడు. దీంతో పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్ అప్రమత్తమయ్యారు. రైతును తన కార్యాలయానికి పిలిపించుకుని చర్చించాడు. 15 రోజుల్లో పరిహారం అందేలా చూస్తామని రైతుకు హామీ ఇచ్చారు. అయితే రైతు రేకుల షెడ్డు పడగొట్టే వరకూ పరిస్థితి తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. కనీసం సీఎం సొంత నియోజకవర్గంలోనైనా ఇలాంటి పరిస్థితి తీసుకురాకుండా వుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.