వారంలోపే వివాదాల్లో మంత్రులు

ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరి కనీసం వారం రోజులు కూడా గ‌డ‌వ‌క‌నే అప్పుడే కొంద‌ర్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ వివాదాల్లో తీవ్ర‌త త‌క్కువ‌, ఎక్కువ ఉండొచ్చు. కానీ ఐదుగురు మంత్రుల వ్య‌వ‌హార‌శైలి మాత్రం తీవ్ర…

ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరి కనీసం వారం రోజులు కూడా గ‌డ‌వ‌క‌నే అప్పుడే కొంద‌ర్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ వివాదాల్లో తీవ్ర‌త త‌క్కువ‌, ఎక్కువ ఉండొచ్చు. కానీ ఐదుగురు మంత్రుల వ్య‌వ‌హార‌శైలి మాత్రం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ నెల 11న కొత్త మంత్రివ‌ర్గం ప్ర‌మాణ స్వీకారం చేసింది. ఈ మంత్రివ‌ర్గంలో 11 మంది పాత‌మంత్రులున్నారు. మిగిలిన 14 మంది కొత్త‌వారు.

ప్ర‌స్తుతం వివిధ కార‌ణాల‌తో విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్న మంత్రుల గురించి తెలుసుకుందాం. వివాదాల‌ను, చేదు అనుభ‌వాల‌ను ఎదుర్కొన్న మంత్రుల్లో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, ఉష‌శ్రీ‌చ‌ర‌ణ్‌, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి , చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు.

స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత మొద‌టిసారిగా అనంత‌పురం జిల్లాలోని త‌న నియోజ‌క‌వ‌ర్గం క‌ల్యాణ‌దుర్గానికి ఆమె వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఘ‌న స్వాగ‌తం ప‌లికే క్ర‌మంలో ఓ శిశువు ప్రాణం కోల్పోవ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. క‌ల్యాణ‌దుర్గంలో మంత్రి ఇంటి స‌మీపంలో బ్ర‌హ్మ‌య్య‌గుడి వ‌ద్ద వీధుల్లో ట్రాఫిక్ ర‌ద్దీ ఏర్ప‌డింది. అదే వీధిలో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న చిన్నారిని బైక్‌పై ఆస్ప‌త్రికి తీసుకెళుతుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. పాప‌కు అనారోగ్యంగా ఉంద‌ని, ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, దారిచ్చి స‌హ‌క‌రించాల‌ని వేడుకున్నా ఫ‌లితం లేద‌నేది బాధితుల ఆవేద‌న‌. అర్ధ‌గంట త‌ర్వాత ఆస్ప‌త్రికి వెళ్లే స‌రికి పాప ప్రాణాలు కోల్పోవ‌డం తీవ్ర రాజ‌కీయ దుమారం రేపింది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై రాష్ట్ర స‌మాచార‌శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ స్వామిభ‌క్తి విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. బాధ్య‌త‌లు తీసుకున్న మొద‌టిరోజే ఆయ‌న మాట‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాల గురించి ఆయ‌న్ను అడ‌గ్గా …సీఎం ఆశీస్సులు కావాలంటే ఆరాధించాలే త‌ప్ప‌, ఆరా తీయ‌కూడ‌ద‌ని ఆయ‌న తెగేసి చెప్పారు. స‌మాచార‌శాఖ మంత్రి వైఖ‌రిపై జ‌ర్న‌లిస్టుల ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వివాదం ప్ర‌స్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లా కోర్టు లాక‌ర్‌లో మంత్రి కాకాణికి సంబంధించిన కేసు సాక్ష్యాధారాలు చోరీకి గురి కావ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు, న్యాయ‌వాదులు డిమాండ్ చేస్తున్నారు.

కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఉప‌ముఖ్య‌మంత్రిగా, దేవాదాయ‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌రుని ద‌ర్శించుకు నేందుకు వెళ్లిన ఆయ‌న్ను భ‌క్తులు నిల‌దీశారు. మంత్రి కోసం గంట‌ల త‌ర‌బ‌డి కంచుగ‌డ‌ప వ‌ద్ద భ‌క్తుల‌ను నిలిపి వేశారు. దీంతో కోపోద్రిక్తులైన భ‌క్తులు నిలదీయడంతో మంత్రి షాక్‌కు గుర‌య్యారు.

రెవెన్యూశాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా వివాదస్ప‌ద‌మ‌య్యారు. మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత తొలిసారి శ్రీ‌కాకుళం వెళ్లిన ఆయ‌న కార్య‌క‌ర్త‌పై చేయి చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌ర‌చాల‌నం చేసిన కార్య‌క‌ర్త‌, ఎంత సేప‌టికీ విడిచి పెట్ట‌క‌పోవ‌డంతో ధ‌ర్మాన అస‌హ‌నంతో భౌతిక‌దాడికి దిగ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. స‌రిగ్గా వారం రోజులు కూడా పూర్తి కాకుండానే ఐదుగురు మంత్రులు వివిధ కార‌ణాల‌తో వార్త‌ల్లో నిలిచారు. రానున్న రెండేళ్ల‌లో ఎవ‌రేం చేస్తారో చూడాల్సిందే.