“ప్రజలకి నేనిదిచ్చాను. ప్రజలు నాకు ఓటెయ్యాలి. ఇదే అసలు క్విడ్ ప్రో కో” అని జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశిస్తూ తమరు అన్నారు.
అసలు క్విడ్ ప్రో కో అంటే ఏవిటి?
లీగల్ భాషలో వాడే ఆ లాటిన్ వాక్యానికి అర్థం “ఇచ్చి పుచ్చుకోవడం” అనే కదా! అయినా లా భాష మీకు చెప్పేటంతవాళ్లం కాదనుకోండి!
అయితే ఈ “క్విడ్ ప్రో కో” అనే వాక్యం న్యాయ పరిభాషలో సాధారణంగా క్రిమినల్ అంశాలు మాట్లాడేటప్పుడే వాడుతుండడం వల్ల దీనిని సమాన్యమైన అర్థంలో వాడం. అయితే మీరు లాయర్ కాబట్టి మీకిది బాగా అలవాటైన పదం అయి ఉండొచ్చు. జగన్ మీద మీకు ప్రస్తుతమున్న ఫీలింగ్ రీత్యా ఆ వాక్యాన్ని మీరు తరచూ వాడే క్రిమినల్ యాంగిల్లోనే వాడినట్టు అర్థమవుతూనే ఉంది.
“ఇదే అసలు క్విడ్ ప్రో కో” అని ప్రత్యేకం నొక్కి చెప్పడం వెనుక జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలకి క్రిమినల్ మరకని అంటించే ప్రయత్నమే మీరు చేస్తున్నది.
అసలామాటకొస్తే మానవ సంఘమే “క్విడ్ ప్రో కో” తో ముందుకు సాగుతోంది. ఇప్పుడు కాదు. మనిషి మనుగడ మొదలైనప్పటి నుంచే ఇచ్చి పుచ్చుకోవడమనే ప్రక్రియ ఉంది.
నిర్మొహమాటంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రీకొడుకుల మధ్య, మామా అల్లుళ్ల మధ్య, ఉద్యోగి- యజమాని మధ్య..ఇలా అందరి మధ్య క్విడ్ ప్రో కో ఉంటుంది. లేకపోతే అసలా బంధం కలకాలం కొనసాగదు.
“నేన్నీకు జీతమిస్తాను. నువ్వు నాకు సర్వీస్ అందించు” అనేది కూడా క్రిడ్ ప్రో కో నే.
“నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నన్ను తిరిగి ప్రేమించు” అనేది కూడా క్విడ్ ప్రో కో నే.
మామ అల్లుడుకి గౌరవమిస్తాడు. బదులుగా తన కూతుర్ని బాగా చూసుకోమని కోరతాడు. అదీ క్విడ్ ప్రో కో నే.
ఇలా మానవజాతి సమస్తం ప్రపంచవ్యాప్తంగా క్విడ్ ప్రో కో వల్లే మనుగడ సాగిస్తోంది. దానిని తప్పు బట్టి ఉపయోగం లేదు.
ఓట్ల కోసం ఉత్తుత్తి వాగ్దానాలు చేసే నాయకుల్ని మీరు కూడా ఎందరినో చూసుంటారు ఉండవల్లి గారూ! కానీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్ని అంచెలంచెలుగా అమలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని కూడా కాస్త మీరు ప్రస్తావిస్తే బాగుంటుంది.
అన్నట్టు..పథకాల రూపంలో ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ ట్యాక్సుల రూపంలో వెనక్కి తీసేసుకుంటున్నాడంటున్నారు. మళ్లీ మీరే ఒక ఆటో డ్రైవర్ ని ఉదాహరణగా చెబుతూ ఇంట్లో వితంతువుకి పెన్షన్, గృహిణికి అమ్మ ఒడి, పిల్లలకి ఫీజు కట్టేస్తున్న ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉంటున్నాడంటున్నారు.
అయితే ఆ సమాన్యుడు సంతోషం వెనుక అప్పులున్నాయని మీ బాధ. ఇంత విషయ పరిజ్ఞానం ఉన్న మీకు తెలియదని కాదు.. అమెరికాకి ఎన్ని ట్రిలియన్ డాలర్ల అప్పులున్నాయో, మన దేశానికి ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నాయో..!
మన దేశంలో ప్రతి రాష్ట్రానికి అప్పులున్నాయి. మీరు, ఐ.వై.ఆర్ గారు, జేపీ గారు ఇలా అందరూ పనిగట్టుకుని ఆ.ప్ర ని కాసేపు శ్రీలంకతోటి, ఇంకాసేపు బ్రెజిల్ తోటి పోలుస్తున్నారు. అంతెందుకు? మన కేంద్రంతో పోల్చొచ్చు కదా! ఆ.ప్ర మనదేశంలో ఒక రాష్ట్రమే తప్ప శ్రీలంక, బ్రెజిల్, వెనెజులా మాదిరిగా దేశం కాదుగా!
కాసేపు మీ ఆర్థిక సమీక్ష పక్కనబెట్టి ప్రాక్టికల్ గా సామాన్యుడి దృష్టికోణంలోంచి చూద్దాం.
మీరన్నట్టే ఒక పేదవాడికి ఆ.ప్ర చేస్తున్న అప్పుల్లోంచి ఏడాదికి లక్ష రూపాయలు రకరకాల స్కీముల రూపంలో వస్తోందనుకోండి.
“అయ్యబాబోయ్! అప్పు చేసి మాకెందుకిస్తున్నారు సీయం గారూ! ఆపేయండి. మాకు ఏడాదికొచ్చే లక్షకన్నా రాష్ట్రం అప్పు చేయకపోవడమే ముఖ్యం” అనంటాడా?
అలా కాకుండా ఉన్నవాళ్ల మీద ట్యాక్సులు బాది పేదలకిస్తున్నాడంటే, ఆ పేదవాడు జగన్ ని రాబిన్ హుడ్ లాగ చూస్తాడు తప్ప మరోలా కాదు కదా!
అది కూడా కాదు, ఏడాదికి లక్షిచ్చి మళ్లీ ఆ పేద వాడి నుంచే కరెంటు బిల్లులు, ఇతర ధరల పెంచేసి లాగేసుకుంటున్నాడని చెబితే..దాని వల్ల పేదవాడికొచ్చిన నష్టమేంటి? డబ్బు పుచ్చుకోవడానికి, బిల్లులు చెల్లించడానికి మధ్యలో అనుభవిస్తున్నాడు కదా? పేదవాడికి కావాల్సింది రోజు గడవడం. అంతే కానీ ఉన్నవాళ్లలాగ వెనకేసుకోవడం కాదు.
ఎవరు ఏమనుకున్నా, ఎన్ని లెక్కలేసుకుని ఎలా బాధపడ్డా ఒకటి మాత్రం నిజం. స్కీములందుకుంటున్న పేదవాడు సుఖంగా ఉన్నాడు. ఆ సత్యాన్ని మీరు కూడా ఒప్పుకున్నారు.
రాష్ట్ర జనాభాలో 84% మంది ఓటర్లు స్కీములందుకుంటున్నారని ఒక అంచనా. కామన్ సెన్స్ ప్రకారం అది సాగుతున్నంత కాలం జగన్ ప్రభుత్వానికి తిరుగుండదు. అది ఆగే పరిస్థితి వస్తుందేమోనని చూస్తూ కూర్చోవడం, ఆగాలని కోరుకోవడం తప్ప ప్రతిపక్షాలకి వేరే దారి లేదంతే.
– హరగోపాల్ సూరపనేని