ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని.. ఇందుకు సంబంధించి పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ప్రాథమిక చర్చలుకూడా పూర్తయ్యాయని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనను నమ్ముకుని రాజకీయం చేద్దామని ఆశిస్తున్న అనేక మంది కాంగ్రెస్ వ్యతిరేకులకు అది పెద్ద ఝలక్ అవుతుంది. అలా షాక్ కు గురయ్యేవారిలో తెలంగాణ అధినేత కేసీఆర్ కూడా తప్పకుండా ఉంటారు.
ప్రశాంత్ కిశోర్ ను తన నివాసానికి పిలిపించి, అవసరమైన యావత్ పార్టీ నాయకులు, మంత్రులను అక్కడకు హాజరు పరచి, ఆయనతో ఓ రోజంతా సుదీర్ఘ మంతనాలు సాగించారు కేసీఆర్. ఆ విషయం చాలా సహజంగా మీడియా హెడ్ లైన్స్ లో వచ్చింది. తర్వాతి సందర్భాల్లో ప్రశాంత్ కిశోర్ ను ప్రెస్ మీట్లోనే ఆకాశానికెత్తేశారు. ఆయన సాయం తమ ప్రభుత్వం తీసుకుంటున్నదని కూడా వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ కు అనల్పమైన ప్రాధాన్యాన్ని కట్టబెట్టారు. సదరు పీకే డైరక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా సర్వేలు కూడా జరుగుతున్నాయి.
ఇప్పుడేమో పీకే హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ షాక్ ను కేసీఆర్ ఎలా తట్టుకుంటారో చూడాలి. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ ఇంతెత్తున ఎగిరిపడుతుంటారు. రాష్ట్రంలో ప్రధానమైన ప్రత్యర్థి ఎవరంటే.. బీజేపీతో సమానంగా కాంగ్రెస్ పేరు కూడా చెప్పాల్సిందే. ఒకవైపు తెలంగాణ మీద కాంగ్రెస్ ఫోకస్ పెంచుతోంది.
రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతుండగా, తెలంగాణ టూర్ కు తేదీలు కేటాయించి రాహుల్ కూడా.. పార్టీ బలోపేతాన్ని పట్టించుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పీకే కాంగ్రెస్ లో చేరితే, కేసీఆర్ కు క్షేత్రస్థాయిలో ఆయన టీమ్ నుంచి అందే సహకారం నిజాయితీగానే ఉంటుందా? తమ పార్టీ నాయకుడిగా ఉంటూనే.. తెలంగాణలో తమ పార్టీని మట్టుపెట్టడానికి పీకే పనిచేయడాన్ని కాంగ్రెస్ అనుమతిస్తుందా? అనేది సందేహం.
కేసీఆర్ ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని యాత్రలు చేస్తున్నా, ఎందరు నాయకులను కలుస్తున్నా.. జాతీయ స్థాయిలో ఆయన సంకల్పిస్తున్న మూడో ఫ్రంట్ ముందడుగు పడకపోవడానికి కూడా కారణం ఇదే. కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమి కావాలనేది కేసీఆర్ కోరిక. అయితే డీఎంకే, శివసేన, ఎన్సీపీ లాంటి కీలక పార్టీలు కాంగ్రెస్ ను దూరం పెట్టి, వారితో ప్రస్తుతం ఉన్న మైత్రిని వదలుకుని కేసీఆర్‌ను నమ్మి ఒక కూటమిలోకి వచ్చే అవకాశం తక్కువ.
రాష్ట్రంలో పరిస్థితులపై సర్వేల కంటె కూడా ప్రశాంత్ కిశోర్ తో అనుబంధం అనేది జాతీయ స్థాయిలో అనేక పార్టీలతో మంతనాలు సాగించడానికి, వారితో జట్టు కట్టడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని కేసీఆర్ ఆశించారు. అయితే.. ఇప్పుడు అదే పీకే కాంగ్రెస్ గూటిచిలకగా మారుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రాధాన్యాలు మొత్తం మంటగలిసిపోతాయి. కేసీఆర్ వ్యూహం మంటగలిసిపోతుంది. పైపెచ్చు.. పీకే పన్నబోయే వ్యూహంలో కేసీఆర్ కూడా ఒక పావుగా మారినా ఆశ్చర్యం లేదు.