చంద్రబాబు.. సిగ్గుమాలిన శవరాజకీయం!

మంత్రి కాన్వాయ్ వస్తున్న కారణంగా పోలీసులు నిలిపివేసిన ట్రాఫిక్ లో చిక్కుకుని ఒక పసిపాప మరణించడం అనేది చాలా బాధాకరమైన సందర్భం. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. ప్రాణాపాయ…

మంత్రి కాన్వాయ్ వస్తున్న కారణంగా పోలీసులు నిలిపివేసిన ట్రాఫిక్ లో చిక్కుకుని ఒక పసిపాప మరణించడం అనేది చాలా బాధాకరమైన సందర్భం. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పసిబిడ్డను తల్లిదండ్రులు ఆస్ప్రత్రికి తరలిస్తుండగా, కొత్తగా మంత్రి అయిన ఉషశ్రీచరణ్ అభిమానుల ర్యాలీ కారణంగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ ట్రాఫిక్ ఆగడం వలన పాప మరణించింది. సకాలంలో వైద్యం అందక చనిపోయిందని, మంత్రి ర్యాలీ కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. నిజంగా ఇది బాధాకరమైన సందర్భం. 

మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు కూడా తమ తమ ర్యాలీలు ఉత్సవాల విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలనే పాఠాన్ని ఈ దుర్ఘటన బోధిస్తుంది. అత్యవసర వాహనాలకు తప్ప.. ఏ ఇతర ర్యాలీల విషయంలో, సాధారణ సందర్భాల్లో మంత్రుల వాహనాలు వెళుతోంటే ట్రాఫిక్ ను ఆపడం అనేది ఘోరం. అరాచకం. అలాంటి వాటివల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడితే ఆ మంత్రులు, నాయకులు కూడా సిగ్గుపడాలి. బాధ్యత వహించాలి. తమ వల్ల చరిత్రలో అలాంటి పొరబాటు జరగకుండా మన్నించమని అడగాలి. 

మంత్రులదైనా మరెవ్వరిదైనా ర్యాలీలు ఉంటే.. సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా సాధారణ ట్రాఫిక్ ఆగకుండా ఆ ర్యాలీ సాగే ఏర్పాట్లు చేయడాన్ని పోలీసులు కూడా నేర్చుకోవాలి. నిజానికి మంత్రులు తమ కాన్వాయ్ వెళుతుండగా.. ఎవరైనా అవసరంలో, ఆపదలో ఉండడం గమనిస్తే.. తమంతగా పూనుకుని తమ కాన్వాయ్ వాహనాల్లోనే వారిని తరలించి.. ఆస్పత్రులకు చేర్చిన సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. 

ఇదంతా కల్యాణదుర్గంలో జరిగిన తాజా దుర్ఘటన వ్యవహారం. అయితే ఈ పాప మరణాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రాజకీయంగా వాడుకోవాలని చూడడం అత్యంత హేయం. మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ మరణించిందని చంద్రబాబు, ఆ తల్లిదండ్రుల కడుపుకోత గురించి ఆవేదన చెందుతున్నారు. ఇది మొసలి కన్నీరు కాక మరేమిటి?

కేవలం తన ప్రచార ఆర్భాటం, కీర్తి కండూతి, కెమెరా పిచ్చితో 2015లో గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటకు తద్వారా 29 మంది పుణ్యాస్నానాల కోసం తరలివచ్చిన భక్తులు దుర్మరణం పాలు కావడంలో ప్రధాన నిందితుడు చంద్రబాబునాయుడే. కేవలం తన కారణంగా, 29 మంది అమాయక భక్తులు చచ్చిపోతే.. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు చంద్రబాబునాయుడు. 

ఆ సంఘటనను మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించాడు. అంతటి మహాపాపాన్ని మూటగట్టుకున్న ఈ నాయకుడు, ఇవాళ మొసలి కన్నీరు కార్చడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనిపిస్తోంది. ఉషశ్రీ ర్యాలీ పాపను బలిగొన్న మాట నిజమే. కానీ.. దాని గురించి ప్రశ్నించే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా? తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోకుండా, ఆయన మరొకరి మీద నిస్సిగ్గుగా ఎలా నిందలు వేయగలరు? అనేది ప్రజల మదిలో మెదలుతోంది.