షాక్‌…జ‌గ‌న్‌కా? పేద‌ల‌కా?

రాజ‌ధాని అమ‌రావ‌తి (ఆర్‌5 జోన్‌)లో నిరుపేద‌ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం స‌హాయ నిరాక‌ర‌ణ చేయ‌డంతో ఎల్లో బ్యాచ్ ఆనందానికి అవ‌ధుల్లేవు. కేంద్ర ప్ర‌భుత్వం నిధుల మంజూరుకు బ్రేక్ వేయ‌డంతో సీఎం జ‌గ‌న్‌కు షాక్…

రాజ‌ధాని అమ‌రావ‌తి (ఆర్‌5 జోన్‌)లో నిరుపేద‌ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం స‌హాయ నిరాక‌ర‌ణ చేయ‌డంతో ఎల్లో బ్యాచ్ ఆనందానికి అవ‌ధుల్లేవు. కేంద్ర ప్ర‌భుత్వం నిధుల మంజూరుకు బ్రేక్ వేయ‌డంతో సీఎం జ‌గ‌న్‌కు షాక్ అంటూ టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియా సంబ‌రాలు చేసుకుంటున్నారు. కేంద్రం నిధులు మంజూరు చేయ‌క‌పోతే జ‌గ‌న్‌కు పోయేదేమీ లేదు. ఇది నిరుపేద‌ల‌కు షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇటీవ‌ల జ‌గ‌న్ స‌ర్కార్ 50,793 మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేసింది. రాజ‌ధానేత‌ర ప్రాంతాల పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేయాల‌న్న ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ ప‌చ్చ బ్యాచ్ న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించింది. పేద‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చ‌కూడ‌ద‌నే దుర్బుద్ధితో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వ‌ర‌కూ వెళ్లారు. చివ‌రికి కోర్టు ఆదేశాల‌తో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ పంపిణీ చేసింది.

రాజ‌ధానిలో పీఎంఏవై-అర్బ‌న్ కింద 47,017 ఇళ్లు మంజూరు చేయాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి కేంద్ర ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. గ‌త నెల 26న జ‌రిగిన సెంట్ర‌ల్ శాంక్ష‌నింగ్ అండ్‌ మానిట‌రింగ్ క‌మిటీ (సీఎస్ఎంసీ) స‌మావేశం ఆమోదం తెలిపింది. ఒక్కో ఇంటికి కేంద్ర ప్ర‌భుత్వం రూ.1.50 ల‌క్ష‌లు చొప్పున రూ.705 కోట్లు మంజూరు చేయ‌డానికి ఆమోదం కూడా తెలిపిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి విడ‌త‌గా వీటికి మంజూరు చేశామ‌ని, రెండో విడ‌త‌లో మిగిలిన వారి ఇళ్ల నిర్మాణానికి సాయం అందిస్తామ‌ని సీఎస్ఎంసీ స్ప‌ష్టం చేసింది.

దీంతో రాజ‌ధానిలో త‌మ ఇళ్ల నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుగుతుంద‌ని పేద‌లంతా సంతోషంగా, న‌మ్మ‌కంగా ఉన్నారు. మ‌రోవైపు “హైకోర్టు తుది తీర్పునకు లోబ‌డే ఇళ్ల ప‌ట్టాల పంపిణీ వుంటుంద‌ని, తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు కోరే హ‌క్కు ల‌బ్ధిదారుల‌కు ఉండ‌బోద‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, దాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. వైసీపీ ప్ర‌భుత్వం ఇలా అడ‌గ్గానే, కేంద్రం అలా ఆమోద ముద్ర వేసింది. ఈ మొత్తం వ్య‌వ‌హారం నెల‌లోపే పూర్తి కావ‌డం గ‌మ‌నార్హం” అని రామోజీ నేతృత్వంలోని ఈనాడు ప‌త్రిక నాడు రాసిన రాత‌ల గురించి మ‌నం చెప్పుకున్నాం.

తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం నిరుపేద‌ల సొంతింటి క‌ల నెర‌వేర‌కూడ‌ద‌ని కోరుకున్న వారి వైపే కేంద్ర ప్ర‌భుత్వం నిలిచింది. కోర్టు కేసులు తేలిన త‌ర్వాతే నిధులు ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం మెలిక పెట్ట‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. కేంద్ర ప్ర‌భుత్వం స‌హాయ నిరాక‌ణ‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గుతుందా? లేదంటే తానే చొర‌వ చూపి ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుడుతుందా? అనేది తేలాల్సి వుంది.